Rajamouli Birthday Special: తెలుగులో దర్శకత్వానికి హీరోయిజమ్ తీసుకొచ్చిన నేటి మేటి దర్శకుడు ఆయన, తెలుగు వెండితెరను గ్రేట్ విజువల్స్ తో గిలిగింతలు పెట్టిన ప్రపంచస్థాయి దార్శినికుడు ఆయన, ఎన్నో భావోద్వేగాలకు నిలువెత్తు ఆలవాలం ఆయన, అన్ని వర్గాల ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేయడంలో తిరుగులేని విమర్శకుల ప్రశంసకుడు ఆయన, ఆయనే.. గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి.

తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఈ గ్రేట్ విజువల్ డైరెక్టర్ వెండితెరపై ఏ సీన్ ను అయినా కనీవినీ ఎరుగని రీతిలో చూపిస్తాడు. తన సినిమాల నిండా భారీతనం ఉన్నా.. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తాడు. ముఖ్యంగా రాజమౌళి తన హీరోల చేతిలో పెట్టే ఆయుధం దగ్గర నుంచి నుదుటిన బొట్టు, మెడలో వేలాడే లాకెట్ వరకూ.. ఇలా ప్రతీది అర్థవంతంగా ఉండేలా చూసుకుంటాడు.
ఆదివారం రాజమౌళి పుట్టిన రోజు. ఈ సందర్భంగా జక్కన్న సినిమాల్లో నుంచి కొన్ని అంశాలపై ముచ్చటించుకుందాం.
రాజమౌళి తన ప్రతి చిత్రంలో కనీసం రెండు భారీ యాక్షన్ సీన్స్ ను పెడతాడు ఆ రక్తపాతంతో ప్రేక్షకులతో ఈలలు వేయిస్తాడు. అందుకే రాజమౌళి వాడే ఆయుధాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ‘సింహాద్రి’లో నిప్పుల్లే కాలే గొడ్డలిని చూపించి ప్రేక్షకులకు కూడా పూనకాలు వచ్చేలా చేశాడు. ఇక ‘ఛత్రపతి’లో మొనదేలి ఉండే ఆయుధంతో ఈలలు వేయించాడు.
‘విక్రమార్కుడు’లో చక్రమే ఓ ఆయుధం.. ‘ఈగ’లో గుండు సూదే మారణాయుధం… ‘మగధీర’లో ఖడ్గాలే మహాయుధాలు, ‘బాహుబలి’లో ప్రభాసే ఓ ఆయుధం.. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఎన్టీఆర్ బల్లెం ఓ చరిత్ర, రామ్‌చరణ్ బాణం ఓ గమ్యం. ఇది జక్కన్న ఆయుధాల క్రమం. చివరకు భళ్లాల దేవుడి చేత గద పట్టించినా, కాలకేయుడి చేత త్రిశూలం ఎత్తించినా ఒక్క రాజమౌళికే చెల్లింది.
రాజమౌళికి ఆయుధాలే కాదు, లాకెట్స్ కూడా ప్రత్యేకమే. ‘యమదొంగ’లో లాకెట్ కథలోనే కీలకం, ‘ఈగ’లో కూడా ఆ లాకెటే ఎమోషన్. ‘ఛత్రపతి’లో ప్రభాస్ కి వాళ్లమ్మ ఇచ్చే శంఖమే పెద్ద సెటిమెంట్. బాహుబలిలో శివలింగమే మెయిన్ ప్లాట్ పాయింట్. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’లో కూడా చరణ్ మెడలో ఓమ్ ఆకారంలో ఒక లాకెట్ పెట్టాడు. ఏది ఏమైనా కేవలం లాకెట్స్ పెట్టి తన సినిమాల్లో విలువైన భావోద్వేగాలను పడిస్తోన్న ఏకైక దర్శకుడు ఒక్క రాజమౌళి మాత్రమే.
అలాగే రాజమౌళి తన సినిమాల్లో పెట్టే ప్రతి బొట్టుకు ప్రత్యేక అర్థం ఉంటుంది. పాత్రను బట్టి బొట్టు పెట్టడంలో రాజమౌళి దిట్ట. మరి ఆదివారం పుట్టినరోజు జరుపుకోబోతున్న జక్కన్నకి మా ఓకే తెలుగు తరుపున ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు.