
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ మూవీ ‘పుష్ప’. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ లు దుమ్మురేపాయి. ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీగా వస్తోంది. అయితే పుష్ప చిత్రాన్ని లీకులు షేక్ చేస్తున్నాయి.
ఇటీవలే చిత్రంలోని ‘దాక్కో దాక్కో మేక’ పాట విడుదలకు ముందే సోషల్ మీడియాలో దర్శనమివ్వడం చిత్రం యూనిట్ ను షాక్ కు గురిచేసింది. ఈ విషయం తెలిసిన హీరో అల్లు అర్జున్ షాక్ అయ్యాడట.. లీక్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశాడట.. చిత్రీకరణ సమయంలోనే కాదు.. ఇక నుంచి ఎడిటింగ్ రూమ్ లోకి కూడా మొబైల్ ఫోన్లను అనుమతించకూడదని చిత్ర బృందాన్ని ఆదేశించారట.. లీక్ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అల్లు అర్జున్ చిత్ర బృందానికి స్పష్టం చేశాడట..
ఈ క్రమంలోనే చిత్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్ ’ కూడా దీనిపై సీరియస్ గా స్పందించింది. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితులను ఖచ్చితంగా పట్టుకుంటామని.. వారికి శిక్ష వేస్తామని.. దయచేసి ఎవరూ ఇలాంటి లీకులను షేర్ చేయవద్దని ఎంకరేజ్ చేయవద్దని మైత్రీ మూవీ మేకర్స్ విజ్ఞప్తి చేసింది. సినిమా థియేటర్లో వస్తేనే కిక్ ఉంటుందని. ఇలా లీకులతో చూస్తే దాని విలువ ఉండదని దీనిపై ఇక సీరియస్ గా ఉన్నామని మైత్రీ సంస్థ తెలిపింది.