
ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసే ‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా ఆద్భుతంగానే ఉంటుంది. అయితే, ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ తెలియని ఎన్నో విషయాలను ఆడియోల రూపంలో మన హృదయాలలోకి వెళ్లేలా తన వాయిస్ ఓవర్ తో మనల్ని తన శైలిలో మోటివేట్ చేస్తోన్నాడు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాడు. టాపిక్ ఏమిటంటే ‘బీయింగ్ స్ట్రాంగ్’. మనిషి జీవితంలో నిజంగా ఈ బీయింగ్ స్ట్రాంగ్ అనేది అత్యవసరం. ఎవరిలో అయితే ఎక్కువ ఆత్మస్థైర్యం ఉంటుందో, అతని దగ్గర విజయం దాసోహం అంటుంది.
ఇంతకీ ‘బీయింగ్ స్ట్రాంగ్’ టాపిక్ పై పూరి చెప్పిన మాటలు ఆయన మాటల్లోనే.. ‘ఇన్నేళ్లు గడిచిపోయినా అనుకున్నది జరగలేదని బాధపడుతుంటాం. ‘డోన్ట్ గివ్ అప్ బీ స్ట్రాంగ్’ అని ఓ ఫ్రెండ్ అంటాడు, తండ్రి చనిపోతే ఏడుస్తుంటాం. ‘బాధపడకు ధైర్యంగా ఉండు’ అని పక్కనున్న వాళ్ళు అంటుంటారు. ఇలా జీవితంలో ఏ కష్టం వచ్చినా అందరూ అనే మాట ‘బీ స్ట్రాంగ్’ అని. నిజమే వాళ్ళందరూ చెప్పింది అక్షర సత్యం. మన లైఫ్ లో ఏం జరిగినా బీయింగ్ స్ట్రాంగ్ అనేది ఆప్షన్ అయ్యేటపుడు, ఇక మనం ముందుగానే స్ట్రాంగ్ అయిపోవడం మంచింది. ఎందుకంటే స్ట్రాంగ్ అవ్వకపోతే బతకలేం. మరి స్ట్రాంగ్ అవ్వాలంటే మానసిక స్థైర్యం, శారీరక బలం అనే రెండు అంశాలు మనలో ఉండాలి.
ధైర్యంగా ఉండే వారికీ ప్రత్యేకంగా కొన్ని లక్షణాలుంటాయి. అందులో ముఖ్యమైనది కృతజ్ఞత. వాళ్ళు ఎదుటివాళ్ల చేసిన సాయాన్ని మర్చిపోరు. లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు. అలాగే వాళ్ళు సవాళ్లను అంగీకరిస్తారు. చుట్టూ ఉన్నవారితో ఆరోగ్యవంతమైన రిలేషన్ ను ఏర్పరచుకునే విధంగా బిహేవ్ చేస్తారు. చేసే పనిలో రిస్క్ ను ముందుగానే లెక్కిస్తారు. గతాన్ని ఆధారంగా చేసుకుని కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఓటమిని కూడా అవకాశంగా మలుచుకుంటారు. దేని గురించి వాళ్ళు ఫిర్యాదులు చేయరు. అన్నిటికీ మించి వాళ్ళల్లో సహనం, ఓర్పు ఇలా చాలా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి’’
ఇక మీ జీవితంలో ఈ మూడు విషయాలను కూడా పరిశీలించుకోండి. అందులో మొదటిది.. ఒక్క నిమిషం పాటు అయినా నువ్వు గోడకుర్చీ వేయగలుగుతున్నావా ? లేదా?, ఇక రెండోది.. కుర్చీలో నుంచి ఒంటి కాలు పై లేవగలుగుతావా ? లేదా?, అలాగే మూడోది.. మఠం వేసుకుని కింద కూర్చునప్పుడు కనీసం రెండు చేతులు నేల మీద పెట్టకుండా పైకి లేవగలుగుతున్నావా ? లేదా?.. ఈ మూడూ ఒక్కసారి ప్రయత్నించండి. గుర్తు పెట్టుకోండి. ఫిట్ గా ఉన్నప్పుడు మీరు ఏదైనా చెప్తే మీ పిల్లలు వింటారు. లేకపోతే, ఏం చెప్పినా ఎవరూ వినరు. ఒకవేళ మీకు ఆ పరిస్థితి వస్తే మాట్లాడడం ఆపేయండి’ అంటూ పూరి చెప్పుకొచ్చాడు.
