జీవితం అంటే ఏంటీ? ఈ ప్రశ్నకు చాలా మంది సూటిగా సమాధానం చెప్పలేరు. మీ జీవితం ఎలా సాగుతోందని అడిగితే మాత్రం.. ఏదో ఒక ఆన్సర్ ఇస్తారు. అందులో మెజారిటీ పీపుల్ మాత్రం.. ‘ఏదో సాగిపోతోంది’ అని అంటుంటారు.
అయితే.. జీవితం ఎలా సాగాలి? అనే విషయమై తన అభిప్రాయాన్ని వెల్లడించారు ప్రముఖ సినిమా దర్శకుడు పూరీజగన్నాథ్. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ వేదికగా పలు అంశాలపై తన ఫీలింగ్స్ ను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా.. ఎలా జీవించాలి? అన్న విషయమై మాట్లాడారు. పూరీ ఫిలాసఫీ ప్రకారం ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ‘లివ్ డేంజరస్లీ’ అంటారు. అంటే.. బతుకు ప్రశాంతంగా సాగిపోవాలని ఎప్పుడూ కోరుకోవద్దని అంటున్నారు పూరీ. సవాళ్లు లేని జీవితాన్ని కోరుకోవద్దని సూచిస్తున్నారు. ఆయన మాటల్లోనే చూస్తే..
‘‘లివింగ్ డేంజరస్లీ ఈజ్ ది ఓన్లీ వే’ అని ఎంతో మంది చెప్పారు. సవాళ్లు లేని జీవితాన్ని కోరుకోవొద్దు. సెక్యూరిటీ ఇవ్వు అని జీవితాన్ని అడగొద్దు. ఎలాంటి ఎత్తుపల్లాలు లేని సాధారణ మైదానంలో బతుకుదామని అనుకుంటారు అందరూ. కానీ.. జీవితంలోఎత్తైన కొండలు, పర్వతాలు అనేవి ఉండాలి. రిస్క్ తీసుకోవడం.. రిస్క్ లోకి దూకడమే మన క్యారెక్టర్ కావాలి. చేసే పనులెప్పుడూ ఒకే విధంగా ఉండకూడదు. అలా ఉంటే బోరింగ్ గా ఉంటుంది. జీవితం అనే కొవ్వొత్తిన రెండు వైపులా వెలిగించేద్దాం. ఇలాంటి ఆలోచనా విధానం మనిషికి అవసరం. జీవితాన్ని ఎప్పుడూ దూరం నుంచి చూడొద్దు.’’ అని చెప్పారు.
ఇంకా కొనసాగిస్తూ… ‘‘జీవితం అంటే మనం మాత్రమే కాదు.. మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. వాళ్లందరినీ చూడు. వాళ్లకంటే డేంజరస్ గా ఏమైనా చేయగలవేమో ఆలోచించు. ఒక్కసారి ప్రయత్నించి చూడు. భయం దెయ్యం లాంటిది. అది చెప్పినట్టు అస్సలు వినొద్దు. ఆశల్ని, కలల్ని, ఫాలో అయిపో. జీవితమంటేనే ఎన్నో సాహసాలతో కూడుకున్నది. బతికితే డేంజరస్ గానే బతకాలి. సాదాసీదాగా కాదు. అది మనకి వద్దు లివ్ డేంజరస్లీ’’ అని చెప్పారు.
నిజానికి జీవితం ఎప్పుడూ ఒకే విధంగా కొనసాగితే.. నిస్సారమై పోతుంది. సమ్ థింగ్ డిఫరెంట్ గా ఉన్నప్పుడే లైఫ్ లో ఛేంజ్ తెలుస్తుంది. జీవితం ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. ఇదే విషయాన్ని తనదైన పద్ధతిలో వివరించారు పూరీ.