Punith Rajkumar: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం సినీ పరిశ్రమతో పాటు అభిమానులనూ శోక సంద్రంలో ముంచెత్తింది. ఆయన చనిపోయి వారం కావస్తున్న అభిమానులు ఆ షాక్ నుండి బయటకు రాలేకపోతున్నారు. కొందరూ పునీత్ ఇక లేరని తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్తుంటే.. మరికొంత మంది ఆత్మహత్య వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పనీత్ మరణవార్తను జీర్ణించుకోలేక 12 మంది మృతి చెందినట్లు సమాచారం. కొందరు ఆత్మహత్యకు పాల్పడుతుండగా.. మరికొంతమంది హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఆయన భార్య శ్రీమతి అశ్విని స్పందించారు.
ఇటువంటి సమయంలో తమపై చూపిస్తున్నప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. అప్పు మన మధ్య లేకున్నా ఆయన కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటారని అన్నారు. ఎప్పుడూ అభిమానుల సంతోషమే పునీత్ కోరుకున్నారని తెలిపారు. ఆయన లేరని వార్తను మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నామని.. ఆయన మరణం తమ కుటుంబానికి తీరని లోటని బాధపడ్డారు. అటువంటి లోటు ఏ కుటుంబంలో రాకూడదని.. అందుకోసం ఎవరూ ఆత్మహత్యకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేశారు.
పునీత్ మరణం తర్వాత చాలా మంది సినీ ఇండస్ట్రీ వర్గాలు, సాధారణ ప్రజలు కూడా తమకు కూడా ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అన్న అనుమానంతో ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా, పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల టాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన సూర్య సహా మరికొంతమంది పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించారు.