Publicity Designer Ishwar: ఎన్నో గొప్ప చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్ గా తనదైన శైలిలో పబ్లిసిటీ చేసిన ప్రముఖ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (Publicity Designer Ishwar) ఇక లేరు. ఈ రోజు తెల్లవారు జామున నాలుగు గంటలకు ఆయన చెన్నైలోని తన ఇంటిలో మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. పెరిగిన వయసు రిత్యా ఆయన గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఆయన అసలు పేరు కొసనా ఈశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ఆయన స్వస్థలం.
బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’ సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా ఈశ్వర్ సినీ ప్రయాణం సక్సెస్ ఫుల్ గా మొదలైంది. ఇక ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు ఆయన. దాదాపు 40 ఏళ్ల పాటు నిర్విరామంగా సినిమాలుకు పనిచేసి.. అందరి హీరోల సినిమాలకు డిజైనర్ గా వర్క్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ,హిందీ భాషల్లో 2600లకు పైగా చిత్రాలకు పని చేశారు.
విజయా , ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ , వైజయంతి తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఆయన డిజైన్ చేశారు. ‘దేవుళ్ళు’ ఆయన పని చేసిన ఆఖరి చిత్రం. ఈశ్వర్ రాసిన ‘సినిమా పోస్టర్’ పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది.
చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము