దేశంలో కరోనా ఉగ్ర రూపం చూపిస్తోంది. వరుసగా రెండో రోజు 2 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర అన్ని కార్యకలాపాలనూ నిలిపేసింది. వ్యాపార సముదాయాలు, థియేటర్లు, ఆఫీసులు మొత్తం మూసేసింది. ఒకరకంగా ఇది అనధికారిక లాక్ డౌన్ గా భావించొచ్చు. మిగిలిన రాష్ట్రాలు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమలు చేస్తున్నాయి. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది సినీ జనాల్లో!
ఇక్కడ పూర్తిగా థియేటర్లు మూసేసే పరిస్థితి రాకపోయినా.. 50 శాతం సీటింగ్ నిబంధన ఖచ్చితంగా రావొచ్చని అంటున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఇదే జరిగితే సినిమా ఇండస్ట్రీ అభిప్రాయం ఏంటన్నది ప్రశ్న. మేకర్స్ అందుకు సిద్ధంగా ఉన్నారా? అనే చర్చ తెరపైకి వస్తోంది.
జరుగుతున్న డిస్కషన్ ప్రకారం.. 50 శాతం సీటింగ్ తోనూ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారట. సంక్రాంతి సమయంలో సగం సీట్లతోనే సినిమాలు నడిచిన విషయాన్ని వారు పరిగణనలోకి తీసుకుంటున్నారట. విషయం ఉన్న సినిమాలు మంచిగానే కలెక్షన్స్ రాబట్టాయి కాబట్టి.. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో సినిమాలను రిలీజ్ చేసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. తెచ్చిన అప్పులకు కుప్పలు తెప్పులుగా వడ్డీలు పెంచుకునే కన్నా.. ఇదే నయమని అనుకుంటున్నారట.
కానీ.. వారిని వేధిస్తున్న ఆందోళన మరొకటి ఉంది. అదే.. ప్రేక్షకుల రాక! కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతుండడంతో.. థియేటర్లకు రావడానికి జనం భయపడుతున్నారని నిర్మాతలు భావిస్తున్నారు. భావించడమే కాదు.. అందులో వాస్తవం కూడా ఉంది. కొవిడ్ తారస్థాయికి చేరుతున్న తరుణంలో.. థియేటర్ కు వెళ్లి సాహసం చేయాల్సిన అవసరం ఏముందని ప్రేక్షకులు భావిస్తున్నారట.
ఇలాంటి పరిస్థితుల్లో.. భారమైనప్పటికీ సినిమాలను వాయిదా వేసుకోవడం మినహా చేయడానికి ఏమీ లేదని అంటున్నారట నిర్మాతలు. ఇదే పరిస్థితి సుదీర్ఘ కాలం కొనసాగితే.. చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.