Dil Raju Vs C Kalyan: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు మాటల యుద్దానికి తెరలేపాయి. ప్రత్యర్థి దిల్ రాజుపై సి. కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కీలక ఆరోపణలు చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జులై 30న జరగనున్నాయి. దిల్ రాజు ప్యానెల్, సి. కళ్యాణ్ ప్యానెల్ బరిలో దిగాయి. ఎన్నికల ప్రచారం చేసుకోకుండా దిల్ రాజు నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ సి. కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఓటర్లు విచక్షణతో, అండగా ఉండేవాళ్లను గెలిపించాలని కోరుకున్నారు.
ఫిల్మ్ కౌన్సిల్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచామని ప్రచారం చేసుకుంటున్నారు. అది నిజం కాదు. 70-30 రేషియోలో అభ్యర్థులను నిలిపారు. మా 30 % అభ్యర్థులు గెలిచారు. సరే గెలిచి మీరు పరిశ్రమకు, నిర్మాతలకు చేసింది ఏమిటీ?. ఇప్పుడు గెలిచి ఏం చేస్తారు? చిన్న నిర్మాతలకు, చిన్న చిత్రాలకు మీరు మేలు చేయరు. ఏం చేసినా మీ వ్యాపారం కోసమే. ఇప్పతి వరకు ఎంత మంది నిర్మాతల సమస్యలు తీర్చారో చెప్పండి.
షూటింగ్స్ కి బంద్ ప్రకటించి సమస్యలు చర్చిద్దాం అన్నారు. విజయ్ తో నేను చేసేది తమిళ సినిమా అని షూటింగ్ చేసుకున్నావు. సమంత మూవీ షూటింగ్ కూడా అలానే చేశావు. మీ 20 మంది పెద్ద నిర్మాతలతో పరిశ్రమ నడవదు. మీ వ్యాపారం మాత్రం నడుస్తుంది. కానీ చిన్న నిర్మాతలు లేకపోతే పరిశ్రమే ఉండదు. అప్పుడు మీ వ్యాపారం కూడా ఉండదు.చిన్న నిర్మాతలు బాగుండాలి. ఒకప్పుడు చిన్న చిత్రాల కోసం కమిటీ ఉండేది. ఇప్పుడు అది ఎందుకు లేదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ డబ్బులు గిల్డ్ దోచేస్తుంది. అయినా వెల్ఫేర్ ఆపకుండా చూసుకున్నాము.
ఎంత మంది సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ మీ వలన ఆత్మహత్య చేసుకున్నారో చెప్పండి. మీకు పోటీగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ని నాశనం చేశారు. వాళ్ళు ఏమయ్యారు. మీరు సేవ చేయరు. వ్యాపారమే చేస్తారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచి మీరు పరిశ్రమకు చేసిందేమీ లేదు. రేపు ఛాంబర్ ఎన్నికల్లో గెలిచినా చిన్న సినిమాకు, నిర్మాతలకు మీరు ఎలాంటి సేవ చేయరు. మీకు కావాల్సింది వ్యాపారం మాత్రమే. అందుకే మిత్రులారా… మీకు సదా అందుబాటులో ఉండి సమస్యలు తీర్చే సి. కళ్యాణ్ ప్యానెల్ ని పూర్తి స్థాయిలో గెలిపించండి. మీకు మేలు జరుగుతుందని… సి.కళ్యాణ్ వేడుకున్నారు.
ఎప్పటి నుండో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, గిల్డ్ మధ్య వివాదం నడుస్తోంది. కౌన్సిల్ ఉండగా గిల్డ్ ఎందుకనే వాదన గతంలో నడిచింది. దిల్ రాజు నేతృత్వంలో గిల్డ్ నడుస్తుంది. ఒక్కో విభాగం మీద దిల్ రాజు పట్టు సాధిస్తూ పరిశ్రమను గుప్పెట్లో పెట్టుకుంటున్నాడనే వాదన ఉంది. ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి…