హీరోయిన్లకు సోషల్ మీడియాలో ప్రపోజ్ చేయడం ఈ మధ్య ఆనవాయితీ అయిపోయింది. ఈ మధ్య నెటిజన్లు తరుచూ ‘నన్ను పెళ్లి చేసుకుంటారా ? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఏమి చేయాలి ? ఇలాంటి కామెంట్స్ తో మొత్తానికి కొత్త ట్రెండ్ కి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు అభిమాన తారలను ఒకసారి చూడాలని ఎన్నో కలలు కనేవారు.
కానీ ఇప్పుడు ఆ తారలతో సెల్ఫీ దిగాలని, మరీ కుదిరితే ఏకంగా ఆమె చేయి పట్టుకుని నడవాలని ఇలా పగటి పూటే కలలు కంటూ మురిసిపోయే వారు కొందరు ఉన్నారు. ఈ పగటికలలు కనేవాళ్లల్లో ఓ నెటిజన్, తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తో వన్ సైడ్ ప్రేమలో పడి మునిగితేలుతున్నాడు. అయితే, అతనికి తన ప్రేమను ఆమెకు చెప్పాలి అనిపించింది.
కానీ ఎలా వ్యక్తం చేయాలి? ఎలా బుట్టలో వేసుకోవాలి? పెళ్లికి ఎలా ఒప్పించాలో అర్థం కాక, గత కొన్ని రోజులుగా తెగ ఫీల్ అయిపోతున్నాడు. మొత్తానికి ఈ ఫీలింగ్ ను ఇక భరించలేక తన సమస్యకు పరిష్కారం సూచించమని ప్రియా భవానీ శంకర్ నే సూటిగా ప్రశ్నిస్తూ.. ‘నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే నేనేం చేయాలో చెప్పగలరు’ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.
ఈ వినూత్న పోస్ట్ చూసిన ప్రియా భవానీ శంకర్ స్పందిస్తూ ‘కొత్తవారికి నేను అర్ధం కాను. నాతో ప్రయాణం కొత్తవారికి కష్టమే. అందుకే నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలన్న విషయం మీకు తెలియకపోవడమే మంచిది, అదే సేఫ్ కూడా’ అంటూ ప్రియా భవానీ బదులిచ్చింది. మొత్తానికి ప్రియాభవానీ శంకర్ తెలివిగా సమాధానం ఇచ్చింది.
ఎంతైనా చిన్న న్యూస్ రీడర్ గా పని చేసిన ప్రియాభవానీ శంకర్ కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతూ బుల్లితెర పై పాపులారిటీని తెచ్చుకుని, ఆ తర్వాత వెండితెర వైపు అడుగులు వేసి, పలు తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి పేరు తెచ్చుకుంది. ఇక మంచు మనోజ్ సరసన ‘అహం బ్రహ్మాస్మి’లోనూ ప్రియాభవానీ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
