
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఎప్పుడు అంతం అవుతుందో తెలియదు గానీ.. కొంత మంది డైరెక్టర్లకు మాత్రం ఇది మంచి చేస్తోంది. ఎందుకంటే ఈ వైరస్ వారికి కథాంశంగా మారింది. కరోనా నేపథ్యంలో వరుసగా సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ పేరుతో చిత్రాన్ని ప్రకటించాడు. నాలుగు నిమిషాల నిడివితో ట్రైలర్ కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా కరోనా కథాంశంతో సినిమా తీస్తున్నట్టు తెలిపాడు. ఆర్జీవీ… కరోనా వైరస్‌తో భయపెడితే.. ప్రశాంత్ మాత్రం ‘కరోనా వ్యాక్సిన్’తో ఉపశమనం కలిగించేలా ఉన్నాడు. తన తొలి చిత్రం ‘అ’ తోనే జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రశాంత్.. ఈ మధ్యే రాజశేఖర్ తో ‘కల్కి’తో ఆకట్టుకున్నాడు. బలమైన కథ, వైవిధ్యమైన కథాంశంతో పాటు అద్భుతమైన టేకింగ్‌తో మేటి దర్శకుడిగా ఎదిగే సత్తా తనలో ఉందని నిరూపించుకున్నాడు.
ఈ క్రమంలో తన మూడో సినిమాను అనౌన్స్ చేసేప్పుడూ ప్రశాంత్ వైవిధ్యాన్ని చాటుకున్నాడు. ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని చెప్పిన ఈ యంగ్ డైరెక్టర్ ప్రీ లుక్ (పోస్టర్)ను ఆకస్తికరంగా తయారు చేశాడు. ఈ పోస్టర్‌పై కరోనా వ్యాక్సిన్ అని రాసి ఉంది. ఇంజక్షన్ సిరంజిపై 10 శాతం అని ఉంది. దాని కింద లోడింగ్ అని రాశారు. రేపు ఉదయం 9 గంటలకు ప్రిలిమినరీ టెస్ట్ అని ఉంది కాబట్టి శుక్రవారం ఫస్ట్ లుక్ లేదా టీజర్ రిలేజ్ చేస్తారని అర్థమవుతోంది. ఆర్జీవీ ఇప్పటికే కరోనా వైరస్ అని టైటిల్ ఖరారు చేసిన నేపథ్యంలో ప్రశాంత్ వర్మ కరోనా వ్యాక్సిన్‌నే ఫైనల్ చేస్తాడో వేరే పేరు పెడతాడో చూడాలి.
ANNOUNCEMENT: pic.twitter.com/Fh0XvJmvpI
— Prasanth Varma (@PrasanthVarma) May 28, 2020
కాగా, లాక్‌డౌన్ పూర్తిగా అమల్లోకి రాకముందే ప్రశాంత్ వర్మ 40 శాతం షూటింగ్‌ను పూర్తి చేసినట్టు సమచారం. కరోనా వైరస్ ఇండియాకు రాకముందే చైనాలో పరిస్థితిని తెలుసుకుని ప్రశాంత్ కథ సిద్ధం చేసుకున్నాడట. జనవరి నెల చివరి వరకు పలు సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తోంది.