Prashant Kishor: టిడిపికి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్?

2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేశారు. సమాజంలో ప్రాంతాలను వర్గాలను, కులాలను,మతాలను విభజించి మరీ జగన్ వైపు టర్న్ అయ్యేలా చేశారు. సామాజిక తంత్రాన్ని రేపిమరి వైసీపీకి లబ్ధి చేకూర్చారు.

Written By: Dharma, Updated On : December 13, 2023 6:14 pm

Prashant Kishor

Follow us on

Prashant Kishor: తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారా? చంద్రబాబు అరెస్టు తరువాత ఎంటర్ అయ్యారా? టిడిపికి తన వంతు సహకారం అందిస్తున్నారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చి నడుస్తోంది. ఇది ఎంతవరకు నిజమని నేతలు ఆరా తీయడం కనిపిస్తోంది. వ్యూహకర్త ఉద్యోగం వదిలి.. ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎంతోమంది నేతలను గెలిపించిన ఆయన మాత్రం.. నాయకుడిగా రాణించకపోవడంతో.. తిరిగి వ్యూహకర్త అవతారమెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఒక సంచలనమే. మొన్నటి వరకు ఇదే ప్రశాంత్ కిషోర్ ను టిడిపి విమర్శించింది. ఇప్పుడు ఆయన సలహాతోనే రాజకీయాల చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకోనుంది.

2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేశారు. సమాజంలో ప్రాంతాలను వర్గాలను, కులాలను,మతాలను విభజించి మరీ జగన్ వైపు టర్న్ అయ్యేలా చేశారు. సామాజిక తంత్రాన్ని రేపిమరి వైసీపీకి లబ్ధి చేకూర్చారు. అప్పటి టిడిపి ప్రభుత్వం పై విష ప్రచారం చేసి ఏపీ ప్రజలను వైసీపీకి చేరువు చేశారు. జగన్కు కనీవినీ ఎరుగని అంతులేని విజయాన్ని కట్టబెట్టడంలో ప్రశాంత్ కిషోర్ కీలక భూమిక పోషించారు. అటువంటి వ్యక్తి జగన్ అధికారం చేపట్టాక వ్యూహకర్త పదవి నుంచి దూరమయ్యారు. తన ఐపాక్ టీమ్ ను వారికి అప్పగించారు. మొన్నటి వరకు జగన్ కు సలహాలు, సూచనలు అందించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ టిడిపికి పనిచేస్తున్నట్లు వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుండడం విశేషం.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ వ్యూహ కర్తగా వ్యవహరిస్తున్నారు. రాబిన్ పీకే టీంలో గతంలో పనిచేసేవారు. ఇటీవల హైదరాబాదులో ప్రశాంత్ కిషోర్ తో రాబిన్ శర్మ సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో నారా లోకేష్ ఎక్కువగా ఢిల్లీలో గడిపారు. ఆ సమయంలో సైతం పీకే పలుమార్లు కలిసి చర్చించారని తెలుస్తోంది. అప్పటి నుంచే ఏపీలో రాబిన్ శర్మతో పాటు పీకే టీంలు కలిసి పనిచేస్తున్నాయని ఒక ప్రచారం ఉంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే.. పీకే మనసు మార్చుకుని టిడిపికి పనిచేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ ను లోకేష్ ప్రత్యేకంగా కలిసినట్లు ప్రచారం జరిగింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీకి పీకే సేవలందించిన సంగతి తెలిసిందే. అప్పట్లో మమతా బెనర్జీ ద్వారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్లు తెలుస్తోంది. అప్పట్లోనే కలిసి పనిచేయాలని లోకేష్ కోరినట్లు ఒక వార్త బయటకు వచ్చింది. అయితే అప్పటికే బీహార్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన పీకే.. ఏపీ ఎన్నికల సమయంలో తన సేవలు అందిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల తర్వాత.. ఏపీలో రాబిన్ శర్మతో కలిపి వ్యూహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ప్రాథమికంగా టిడిపి శ్రేణులకు ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. కేవలం రాబిన్ శర్మ టీంలో తన బృందాన్ని కలిపి పీకే కథ నడిపిస్తున్నట్లు సమాచారం. మరి వచ్చే ఎన్నికల్లో పీకే టీడీపీని గెలిపిస్తారా? లేదా? అన్నది చూడాలి.