
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి సిరీస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ నటించిన సాహోకు డిజాస్టర్ టాక్ వచ్చినా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్ల తక్కువ నష్టాలతో నిర్మాతలు బయటపడ్డారు. సాహో సినిమాకు నష్టాలు రావడంతో ప్రభాస్ ఇకపై తక్కువ బడ్జెట్ సినిమాలలోనే నటించడానికి సిద్ధమవుతున్నాడంటూ గతంలో రూమర్లు వచ్చాయి.
కానీ ప్రభాస్ మాత్రం తన ప్రతి చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కేలా ప్లాన్ చేసుకుంటూ పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఈ సినిమా తరువాత ప్రభాస్ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు;. మహానటి సినిమా తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. నిన్న ప్రభాస్ హీరోగా ప్రకటించిన ఆదిపురుష్ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ రాబోయే మూడు సినిమాల బడ్జెట్ ఏకంగా 900 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.