తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘వకీల్ సాబ్’ ప్రభంజనం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ దాటేసిన ఈ చిత్రం.. ప్రీ-రిలీజ్ బిజినెస్ ఆల్మోస్ట్ కవర్ చేసేసింది. అతి త్వరలో షేర్ కూడా సెంచరీ కొట్టేస్తుందని అంటున్నారు. ఏపీలో అడ్డంకులు ఎదురు కాకుంటే.. కలెక్షన్లు మరింతగా మోతెక్కిపోయేవని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తానికి.. భారీ బ్లాక్ బస్టర్ తో పవర్ స్టార్ రీ-ఎంట్రీ ఇచ్చినట్టైంది.
అయితే.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ట్రైలర్ రిలీజ్ వరకు పెద్దగా అంచనాల్లేవు. ఇక అభిమానులైతే ఒకింత ఆందోళనకు గురయ్యారు. మూడేళ్ల తర్వాత పవన్ తెరపై చూడబోతున్నందుకు ఆనందపడాలో.. మహిళా కథాంశంతో వస్తున్నందుకు బాధపడాలో అర్థంకాని కండీషన్లో ఉండిపోయారు.
వాళ్లు డ్రా బ్యాక్స్ గా భావించిన ఎన్నో అంశాలను ఎత్తిచూపారు. మొదటగా ఈ సినిమా పింక్ రీమేక్. అంటే.. కథ అందరికీ ముందుగానే తెలిసిపోయింది. కాబట్టి క్యూరియాసిటీ లేదు. ఇక, హీరోయిజాన్ని ఎలివేట్ చేసే అంశాల్లేవు. కోర్టు చుట్టూ తిరిగే కథలో.. వాదనలు వినిపించే లాయరుగా కనిపించబోతున్నాడు పవన్ అంటూ ఎన్నో కంప్లైంట్లు చేశారు. పవర్ స్టార్ రీ-ఎంట్రీకి ఇలాంటి సినిమానా? అని మదనపడిపోయారు అభిమానులు.
నిజానికి సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు రూమ్ లోనే నడిచిపోయింది. అంటే.. పవన్ డైలాగులు చెప్పడం మినహా.. పెద్దగా చేయడానికి స్కోప్ లేదు. అలాంటి సినిమానే.. ఇండస్ట్రీని షేక్ చేసే విజయం సాధించింది. పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రంగా నిలిచింది. మరి, కేవలం నల్లకోటు వేసుకొని కోర్టులో వాదనలు వినిపించిన ఒకీలు పాత్రతోనే పవన్ ఇలాంటి సంచలనం సృష్టిస్తే.. రేపు రాబోయే పవర్ ఫుల్ చిత్రాల పరిస్థితి ఏంటని లెక్కలు వేసుకుంటున్నారు సినీ జనాలు.
క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్న విషయం తెలిసిందే. అంటే.. హీరోయిజానికి కావాల్సినంత స్కోప్ ఉంటుంది. ఇప్పటికే.. టైటిల్ గ్లింప్స్ లో ఆ విషయాన్ని ప్రకటించాడు దర్శకుడు.
ఇక, అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లోనూ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు పవర్ స్టార్. అటు హరీశంకర్ కూడా మరోసారి గబ్బర్ సింగ్ స్థాయి సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో.. ఈ చిత్రాల్లో ‘పవరిజం’ ఎలా ఉండబోతోందో అని ఇప్పట్నుంచే అంచనాలు వేసుకుంటున్నారు అభిమానులు.