Posani Vs Ashwini Dutt: పోసాని కృష్ణమురళీ… తెలుగు నాట పరిచయం అక్కర్లేని పేరు. సినీరంగంలో రచయతగా మొదలయిన ఇతని కెరీర్, ఆ తరువాత దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఎన్నో సేవలు అందించాడు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. పొలిటికల్ గాను యాక్టివ్ గా ఉన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పోటీ చేసిన పోసాని.. ఎలక్షన్ లో ఓడిపోయాడు.2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు. ఇటీవలే ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా జగన్ సర్కారు పదవి కట్టబెట్టింది. రాజకీయ విమర్శలతో ఎప్పటికప్పుడు దుమారం రేపుతున్నారు. తాజాగా ఆయన అశ్వనీదత్ ను టార్గెట్ చేసుకొని చేసిన కామెంట్స్ సెగలు పుట్టిస్తున్నాయి.
జగన్ సర్కారుపై చురకలు..
నంది అవార్డ్స్ విషయంలో అశ్వనీదత్ ఏపీ సర్కారుపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై పోసాని తనదైన శైలిలో రిప్లయ్ ఇచ్చారు. ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కృష్ణ సూపర్ హిట్ ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఈ విషయాన్ని తెలిపారు. ఆ సమావేశంలో విలేకరులు నంది పురస్కారాల గురించి ప్రశ్నించారు. దీనిపై అక్కడే ఉన్న అశ్వినీదత్ స్పందించారు. జగన్ సర్కారుపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చురకలు అంటించారు.
టీడీపీ వస్తుందని చెప్పడంతో..
నంది అవార్డుల ప్రదానోత్సవం అనేది ఇప్పుడు జరగకపోవడాన్ని అశ్వనీదత్ ప్రస్తావిస్తూ.. ఇప్పుడు నడుస్తున్న సీజన్ వేరు కదా? ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ… వాళ్ళకు ఇస్తారు. సినిమాకు ఇచ్చే రోజులు మరో రెండు, మూడు ఏళ్లలో వస్తాయి అని చెప్పుకొచ్చారు. త్వరలో టీడీపీ గెలుస్తుందని.. అప్పుడు నంది అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమవుతుందని అర్ధం వచ్చేలా మాట్లాడారు. దీంతో వైసీపీ నేత హోదాలో స్పందించిన పోసాని అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. గతంలో అశ్వనీదత్ తనతో అన్న మాటలంటూ గుర్తుచేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు.
ఘాటు వ్యాఖ్యలతో రిప్లయ్..
గతంలో అశ్వనీదత్ తన దగ్గర వాపోయిన విషయాలను బయటపెట్టేశాడు. ఉత్తమ వెన్నుపోటు దారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ డాఫర్ వంటి వారికే అవార్డులు ఇస్తున్నారని అశ్వనీదత్ అన్నట్టు చెప్పుకొచ్చాడు. అసలు, జగన్ ప్రభుత్వం అవార్డులు ఇవ్వకపోవడానికి సరికొత్త భాష్యం చెప్పాడు. ఒక వేళ జగన్ అవార్డులను ప్రకటిస్తే తన మనుషులకు ఇచ్చుకుంటారని ప్రచారం చేస్తారని.. అందుకే ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా నాడు ఎన్టీ రామారావుపై గురిచూసి చెప్పులతో దాడి చేసిన వారికే చంద్రబాబు గుర్తించుకొని అవార్డులు ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పోసానిపై సినీ జనాల ఆగ్రహం..
కొద్ది నెలల కిందట పవన్ కళ్యాణ్ పై కూడా పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ పై విమర్శ చేశారని ఏకంగా పవన్ పైనే తిట్ల దండకం అందుకున్నారు. చిరంజీవి కుటుంబంపై కూడా వ్యాఖ్యానించారు. అందుకు మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. కొద్దిరోజుల పాటు సైలెంట్ అయ్యారు. సినీ పరిశ్రమ నుంచి జగన్ సర్కారుపై విమర్శ వచ్చిన ప్రతిసారి పోసాని రియాక్టవుతున్నారు. తాను సినీ పరిశ్రమకు చెందిన వాడిని కాదన్నట్టుగా..ఓ రాజకీయ నేతగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పడు అశ్వనీదత్ ను కడిగిపారేశారు. అయితే పోసాని ప్రవర్తనపై మాత్రం సినీ జనాలు ఆగ్రహంగా ఉన్నారు. ఆయన పరిమితి మించి మాట్లాడుతున్నారని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.