Devisree Prasad : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ తో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉంటాడు. ఈయన వయస్సు దాదాపుగా 45 ఏళ్ళు ఉంటుంది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఇండస్ట్రీ లో అప్పట్లో ఈయన ప్రముఖ హీరోయిన్ ఛార్మీ కౌర్ తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించాయి. ఆరోజుల్లో వీళ్లిద్దరు కలిసి అనేక చోట్ల కలిసి తిరిగేవాళ్లు కూడా. కానీ మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ, బ్రేకప్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా దేవిశ్రీప్రసాద్ పై అనేక రూమర్స్ వినిపించాయి కానీ, ఏది నిజం అవ్వలేదు. అసలు ఇతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందో లేదో కూడా తెలియడం లేదు. ఇది ఇలా ఉండగా నిన్న ‘తండేల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాసు దేవి శ్రీ ప్రసాద్ పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘ తండేల్ చిత్రం ఈరోజు ఇంత అద్భుతంగా వచ్చింది అని బలంగా చెప్తున్నాను అంటే అందుకు దేవి శ్రీ ప్రసాద్ కూడా ఒక ముఖ్య కారణం. ఆయన అందించిన సంగీతం సినిమాకి ఆయువుపట్టులాగా నిల్చింది. కొన్ని సన్నివేశాలకు అయితే ఆయన అందించిన రీ రికార్డింగ్ వేరే లెవెల్ లో ఉంది. అది రేపు మీరంతా థియేటర్స్ లో చూస్తారు. దేవిశ్రీప్రసాద్ ని ఇంట్లో అందరూ బుజ్జి అని పిలుస్తుంటారు. మా సినిమాలో కూడా ఒక బుజ్జి తల్లి ఉంది. ఇక్కడ దేవి ప్రసాద్ అనే బుజ్జి ఉన్నాడు. మరి తల్లి ఎక్కడుందో, ఏమి చేస్తుందో తెలియదు. మా అందరికీ పెళ్లిళ్లు అయ్యి పిల్లలు కూడా పుట్టేసారు. కానీ మా దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. త్వరలోనే ఆయనకి పెళ్లి అవ్వాలి, ఆయన పిల్లలు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.
దీనికి కింద కూర్చున్న దేవిశ్రీ ప్రసాద్ స్పందిస్తూ ‘మన చేతుల్లో ఏమి లేదు..రాసి పెట్టి ఉంటే జరుగుద్ది’ అంటూ సైగలతో బదులిచ్చాడు. ఇకపోతే ఆయన సంగీతం అందించిన ‘తండేల్’ చిత్రం పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. ఈరోజు సినిమాకి ఇంత మంచి క్రేజ్ వచ్చిందంటే అందుకు కారణం దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వగానే దేవిశ్రీ పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ ‘తండేల్’, ‘పుష్ప 2 ‘ చిత్రాలతో తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. ఫిబ్రవరి 7న విడుదల అవ్వబోతున్న తండేల్ చిత్రంలో దేవిశ్రీ తన మ్యూజిక్ తో ఎలాంటి మ్యాజిక్ చేసాడు అనేది చూడాలి.
