Jagan: జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారా? ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారా? పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలను తీసుకొనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. లండన్ పర్యటన ముగించుకుని జగన్ బెంగళూరు చేరుకున్నారు. ఈనెల 4న తాడేపల్లి కి రానున్నారు. అదే రోజు పార్టీ సీనియర్లతో సమావేశం కానున్నారు. ఆరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడమా? వద్దా? అని ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయంలో వైసిపి అనుకూల మీడియా సైతం ఆయన సమావేశాలకు హాజరుకావాలని కోరుతోంది. కూటమి వైఫల్యాలపై ఎండగడితే ప్రజలు కూడా గుర్తిస్తారని అభిప్రాయపడుతోంది. అయితే జగన్ హాజరవుతారా లేదా అన్నది చూడాలి.
* ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకే
ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం చవిచూసింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక తాను అసెంబ్లీకి హాజరుకాని జగన్ తేల్చి చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు అసెంబ్లీలో అడుగు పెట్టారు. అటు తరువాత రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కానీ హాజరు కాలేదు. అయితే వరుసగా మూడుసార్లు అసెంబ్లీకి గైర్హాజరు అయితే సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే జరిగితే అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్ గా మారనున్నాయి. జాతీయ స్థాయిలో సైతం ప్రాధాన్యత అంశంగా మారనున్నాయి.
* అప్పటి అంశాలను గుర్తుచేసుకొని
గత ఐదేళ్ల వైసిపి హయాంలో అసెంబ్లీ సమావేశాల్లో ఆ పార్టీ సభ్యులు దూకుడు మీద ఉండేవారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు విషయంలో అనుచిత కామెంట్స్ చేసేవారు. అప్పట్లో వైసిపి బాధితులుగా ఉన్న చంద్రబాబు సీఎం గాను, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గాను, అయ్యన్నపాత్రుడు స్పీకర్ గాను, రఘురామకృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్ గాను ఉన్నారు. దీంతో వారిని తట్టుకోవడం జగన్ కు చాలా కష్టం. ఆపై కీలకమైన మంత్రులు కూడా ఉన్నారు. చాలామంది సీనియర్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరందరినీ తన పదిమంది టీం తో ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకే జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యే ఛాన్స్ లేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ హాజరైన గంట రెండు గంటల సెషన్స్ కు మాత్రమే పరిమితం అవుతారని టాక్ వినిపిస్తోంది.
* ఇదే సరైన సమయం
ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. 8 నెలలు అవుతున్న ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రభుత్వం ఉంటే ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే వారమని సైతం గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ పై సైతం ఆందోళనలకు సిద్ధపడ్డారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇవన్నీ కాకుండా శాసనసభకు వెళ్లి కూటమి వైఫల్యాలపై నిలదీయాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అయితే గతం మాదిరిగా జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటారా? లేకుంటే అసెంబ్లీకి వెళ్లి తన సత్తా చూపిస్తారా? అన్నది తెలియాలి.