Poonam Pandey Passed Away: మహిళలూ తస్మాత్ జాగ్రత్త.. పూనం పాండే మరణం ఓ హెచ్చరిక

Poonam Pandey Passed Away మనదేశంలో ప్రతి సంవత్సరం 80 వేల మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు.. ఇందులో 35 వేల మంది కన్ను మూస్తున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ కేవలం 1% మంది మాత్రమే గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : February 3, 2024 9:20 am
Follow us on

Poonam Pandey: బాలీవుడ్ నటి పూనం పాండే వయస్సు 32 సంవత్సరాలు. పెద్ద వయసు కూడా ఏమీ కాదు. మొన్నటి దాకా చలాకీగా.. వెండి తెర మీద మెరిసిన ఆ నటి శుక్రవారం హఠాత్తుగా కన్ను మూసింది.. పూనమ్ మరణానికి గర్భాశయ క్యాన్సర్ కారణమని ఆమె మేనేజర్ ఇన్ స్టా గ్రామ్ లో చెప్పేదాకా బయటి ప్రపంచానికి తెలియదు. క్యాన్సర్ ను తగ్గించడానికి విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. పూనమ్ ఎందుకు చనిపోయింది? గర్భాశయ క్యాన్సర్ మరీ అంత ప్రమాదకరమా? ఈ వ్యాధికి చికిత్స లేదా? ఎలాంటి కారణాలు ఈ వ్యాధికి దారి తీస్తున్నాయి? వీటికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మనదేశంలో ప్రతి సంవత్సరం 80 వేల మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు.. ఇందులో 35 వేల మంది కన్ను మూస్తున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ కేవలం 1% మంది మాత్రమే గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ క్యాన్సర్ నివారణ కోసం 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలికలకు టీకా ఇవ్వబోతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించిన మరుసటి రోజే బాలీవుడ్ నటి పూనం పాండే గర్భశాయ క్యాన్సర్ తో చనిపోయింది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం గత ఏడాది 3. 4 లక్షల సర్వైకల్ కేసులు దేశంలో నమోదయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో 15000 కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాదులోని ప్రఖ్యాత ఎం ఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ కు వచ్చే మహిళలలో 13 శాతం సర్వైకల్ క్యాన్సర్ కేసు బాధితులే అని తెలుస్తోంది.

వైద్య పరిభాషలో చెప్పాలంటే మహిళల గర్భాశయం అనేది అత్యంత సున్నితమైన అవయవం.. గర్భాశయ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ ( హెచ్పీవో) ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఈ వైరస్ లైంగిక సంపర్కం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత క్యాన్సర్ గా మారడానికి దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. రోగ శక్తి తక్కువగా ఉండే మహిళల్లో అయితే ఐదు నుంచి పది సంవత్సరాలకే క్యాన్సర్ కణాలు శరీరంలో వృద్ధి చెందుతాయి. ఎక్కువమందితో లైంగిక కార్యకలాపాలకు పాల్పడటం.. గర్భ నిరోధక మాత్రలు ఎక్కువగా వాడటం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ క్యాన్సర్ సోకినప్పుడు మహిళలకు నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం అవుతుంది. పొత్తికడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటుంది. పదేపదే మీరు మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. మూత్ర విసర్జనకు వెళ్ళిన సమయంలో విపరీతమైన మంట వస్తుంది. వీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు యోని దగ్గర మంట పుడుతుంది. ఆ ప్రాంతంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. మెనోపాజ్ తర్వాత ఒకవేళ శృంగారంలో పాల్గొంటే సంభోగం తర్వాత తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. భరించలేనంత నొప్పి పుడుతుంది.. విపరీతమైన మంట ఏర్పడుతుంది. కొద్ది రోజులకు దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ అవుతుంది. కొంతకాలానికి బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. అలసట, ఊరికనే చెమటలు పట్టడం, రక్తహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

మనదేశంలో గర్భాశయ క్యాన్సర్లు గత ఏడాది 3.4 లక్షల నమోదు అయ్యాయని కేంద్రం చెబుతోంది. కానీ అంతకు ముందు సంవత్సరం వివిధ రకాల క్యాన్సర్ కేసులు 14 లక్షలు నమోదయ్యాయి. ఏకంగా తొమ్మిది లక్షల పదివేల మంది కన్నుమూశారు. పురుషుల్లో నోటి, ఊపిరి తిత్తులు, మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. మనదేశంలో 75 సంవత్సరాల లోపు ఉన్నవారు క్యాన్సర్ బారిన పడే ముప్పు 10.6 శాతం, దానివల్ల మరణించే ముప్పు 7.2 శాతంగా ఉంది..