
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత పలువురు నటీనటులు తమ మానసిక సమస్యల గురించి బయటకు చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో తమకు ఎదురైన అవమానాల గురించి మాట్లాడుతున్నారు. డిప్రెషన్‌కు గురైతే చికిత్స తీసుకోవాలని, అంతే కాని ఆత్మహత్య ఆలోచనలు మానుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు నటి పూనమ్ కౌర్ కూడా తన అనుభవాలను వెల్లడించింది. కొంతకాలంగా తాను డిప్రెషన్‌లో ఉన్నానని చెప్పిన ఆమె ఓ దర్శకుడి కారణంగానే తాను కుంగిపోయానని చెప్పింది. ఓ తెలుగు దర్శకుడిపై వరుస ట్వీట్స్ చేసి సంచలనానికి తెరలేపింది. అయితే.. ఆ దర్శకుడు ఎవరనే విషయాన్ని ఆమె బయటపెట్టలేదు. కానీ ట్వీట్స్‌లో మాత్రం గురూజీ అని హాష్ట్యాగ్ జత చేసి హింట్ ఇచ్చింది. సదరు దర్శకుడు తనను అణగదొక్కే ప్రయత్నం చేశాడని.. తప్పుడు వార్తలు రాయించి తన పేరు చెగడొట్టాడని వివరించింది.
‘కొంతకాలం కిందట నేను అనారోగ్యానికి గురయ్యా. ఇదే విషయాన్ని నా ఫ్రెండ్ ఆ డైరెక్టర్ కు చెప్పింది. నేను అస్సలు బాగాలేనని, చాలా సమస్యలు చుట్టు ముట్టాయని ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు చెప్పింది. ఆ టైమ్లో నాకు హెల్ప్ చేయాలని కోరింది. కానీ, ఆయన పట్టించుకోలేదు. దీంతో.. నేనే ఆ దర్శకుడిని నేరుగా సంప్రదించా. నా పరిస్థితి ఏం బాగోలేదని, ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పా. ఒకసారి కలిసి మాట్లాడదాం అన్నా. దానికి అతను ‘ఏమీ జరగదు. నువ్వు చచ్చిపోతే వన్ డే న్యూస్ అవుతావు’ అన్నాడు. అలాంటి కనికరం లేని మాటలు నన్ను మరింత కుంగదీశాయి. మీడియాను, మూవీ మాఫియాను, ప్రకటనలను అతను కంట్రోల్ చేయగలడు. ఆన్‌లైన్‌లో పరోక్ష ఆర్టికల్స్ ద్వారా నన్ను మరింత బాధపెట్టాడు. లేనిపోని వార్తలు నన్ను కుంగదీశాయి. నన్ను డిప్రెషన్‌లోకి నెట్టాయి. ఆ టైమ్‌లో ఆ దర్శకుడికి నేను డైరెక్ట్ రిప్లే ఇచ్చా. ఆ మనిషితో నా ప్రయాణం ‘మధ్య రాత్రి కూడా ప్రాబ్లమ్ ఉంటే నేను వస్తాను అనే దగ్గరి నుంచి నువ్వు చచ్చిపోతే వన్ డే న్యూస్ అవుతావు’ అనే వరకు వెళ్లింది. ఇప్పుడనిపిస్తోంది నేను ఎందుకు కుంగిపోయా? ఇంకా ఎందుకు మామూలు మనిషిని కావడం లేదు అని. ఎందుకంటే నువ్వు నా పేరు సినిమా క్యాస్టింగ్ లిస్ట్ నుంచి తొలగించావు. ఆడియో ఫంక్షన్ లో నా ఫొటోలు తీసేయమన్నావు కదా? ఆ మాటలు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సావిత్రి గారి గురించి వేదికలపై మాట్లాడే నువ్వు.. లోకల్ టాలెంట్ ను ఎప్పుడూ ఎంకరేజ్ చేయవు.పైగా ఎవరైనా ప్రోత్సహిస్తే అడ్డుపడతావు. ఎందుకంటే ఆ అమ్మాయి అందంగా ఉందని ఇతరులు డిక్లేర్ చేస్తే నీకు నచ్చదు కాబట్టి. నీకు మంత్రుల కొడుకులు తెలుసు. బడా కుటుంబాలతో సంబంధాలున్నాయి. అయితే, ఏంటి? నువ్వో మానసిక రోగివి. మాయగాడివి.
నీ స్నేహితుడి జీవితాన్ని నాశనం చేసి లాభపడ్డావు
నీ స్వలాభం కోసం నీ స్నేహితుడి జీవితాన్ని కూడా నాశనం చేశావు. అలా చేసి నీకంటే మరెవరూ లాభపడి ఉండరు. నువ్వో మాయగాడివి. మానసిక రోగివి.. #గురూజీ. నీ స్నేహితుడు తిరిగి తన భార్య దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నావు. ఆమె అంటే ఆయనకు చచ్చేంత ఇష్టం. కానీ, ఆ స్టార్ను ఈ రోజు అందరూ తిడుతున్నారంటే దానికి కారణం నువ్వు ఆ దంపతుల మధ్యలోకి రావడమే. వాళ్ల పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఆయన ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఇలా ఎందుకు చేశావు. స్లో పాయిజన్ మాదిరిగా ఆయణ్ని చంపాలనుకుంటున్నావా? ఇందతా జరిగి పదేళ్లు ఏమీ కాదు 2017లో జరిగింది. ఏదేమైనా నాకు సాయం చేయాలని నేను చాలా వినయంగా అర్థించినా నువ్వు పెడచెవిన పెట్టడంతో నేను షాక్ అయ్యా. నేను ఏ తప్పూ చేయకపోయినా నువ్విచ్చిన షాక్స్ నుంచి ఇంకా బయటపడలేకపోతున్నా. ఇప్పుడు సుశాంత్ సింగ్ కు జరిగింది తెలిసి నిర్ఘాంతపోయా. కానీ, నేను ఆయన మాదిరిగా జీవితాన్ని ముగించను. చికిత్స తీసుకుంటున్నా’ అని పూనమ్ వరుస ట్వీట్స్‌లో వివరించింది.