Poonam Kaur: నటిగా కంటే వివాదాతో పూనమ్ కౌర్ పాప్యులర్ అయ్యారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఆమె చేసే కామెంట్స్ సంచలనం రేపుతుంటాయి. పరోక్షంగా ఎవరినో టార్గెట్ చేసినట్లు పూనమ్ కౌర్ పోస్ట్స్ ఉంటాయి. దీంతో తరచుగా ఆమె వార్తల్లో ఉంటారు. అలాగే సోషల్, పొలిటికల్ అంశాల మీద స్పందిస్తుంటారు. తాజాగా ఆమె సంచలన ప్రకటన చేశారు. ఓ లేఖను విడుదల చేశారు. సదరు లేఖలో పరోక్షంగా కొందరిపై ఆరోపణలు చేశారు.
అందరికీ నమస్కారం. నేను ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. కండువా కప్పుకోలేదు. సందర్భాన్ని బట్టి కొన్ని అంశాల మీద స్పందిస్తాను. కొందరు నాయకులు రాజకీయాల కోసం నన్ను పావుగా వాడుకుంటున్నారు. ఇది సముచితం కాదు. గత ఎన్నికల్లో కూడా ఇలానే చేశారు. నాపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. పైశాచిక ఆనందం పొందారు. ఒక మహిళ మీద కుట్రలు తగవు. ఇంకొందరు సానుభూతి పేరుతో నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు.
నేను సిక్కు మహిళను. మాకు త్యాగాలు, పోరాటాలు తెలుసు. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు. ప్రస్తుతం నేను చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తున్నాను. దీని కోసం వివిధ పార్టీలకు చెందిన నాయకులను కలిశాను. సామాజిక ఉద్యమకారులను కలిశాను. జాతీయ స్థాయిలో ఉద్యమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నాము. నాకు సంబంధించిన విషయం ఏదైనా ఉంటే నేను స్వయంగా వెల్లడిస్తాను. అర్థం చేసుకోగలరు అంటూ… పూనమ్ రాసుకొచ్చారు.
తాజాగా పూనమ్ కౌర్ చంద్రబాబు అరెస్ట్ కి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ఆయన వయసురీత్యా జైల్లో పెట్టడం సరికాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే అంటూ ట్వీట్ చేసింది. ఈ క్రమంలో పూనమ్ కౌర్ ప్రకటన ఎవరిని ఉద్దేశించి అనే చర్చ మొదలైంది. మాయాజాలం అనే మూవీతో పరిశ్రమలో అడుగు పెట్టిన పూనమ్ కౌర్, ఒక విచిత్రం, శౌర్యం, వినాయకుడు, గగనం, ప్రయాణం, నాగవల్లి వంటి చిత్రాల్లో నటించారు.