Pallavi Prashanth: బిగ్ బాస్ టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కేసులో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ప్రశాంత్ తరుపు లాయర్. బిగ్ బాస్ అంటేనే వివాదాల సుడిగుండం. బిగ్ బాస్ సీజన్ 7 పెద్ద హిట్ అయింది. సీజన్ 6 పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో .. మేకర్స్ శ్రద్ధ తీసుకుని దీన్ని హిట్ చేశారు. అయితే ప్రతి సారి షో రన్ అవుతున్న సమయంలో వివాదాలు వస్తుండేవి.
కానీ సీజన్ 7 లో మాత్రం షో ముగిసిన తర్వాత అసలైన రచ్చ మొదలైంది. ఆ రోజు ఫ్యాన్స్ పేరుతో కొందరు అల్లరి మూకలు చేసిన రచ్చ హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇంత జరుగుతున్నా బిగ్ బాస్ నిర్వాహకులు గాని, హోస్ట్ నాగార్జున గాని స్పందించకపోవడం గమనార్హం. ఫినాలే ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇందులో ప్రభుత్వ ప్రైవేట్, ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
దీంతో పరోక్షంగా ప్రశాంత్ కూడా గొడవలకు కారణం అయ్యాడు అంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A 1 గా ప్రశాంత్ ని చేర్చారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రశాంత్ తో సహా అతని తమ్ముడు మహావీర్ ను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టుకు తరలించారు. కాగా వారికి 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు.
దీంతో వాళ్ళిద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. నిన్న పల్లవి ప్రశాంత్ కి బెయిల్ రాగా, నేడు విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ను తప్పుబట్టారు అతని తరుపు లాయర్. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని, అన్యాయంగా అరెస్ట్ చేశారు అని పేర్కొన్నారు. ఏకంగా ఈ ఇష్యు ని సీఎం రేవంత్ రెడ్డి దాకా తీసుకువెళ్లారు ప్రశాంత్ లాయర్. ఈ మేరకు నేడు ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చారు. తక్షణమే ప్రశాంత్ కి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పల్లవి లాయర్ కోరారు.