Nidhi Agarwal : సవ్యసాచి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిధి అగర్వాల్. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనంతరం మరో అక్కినేని హీరో అఖిల్ తో జతకట్టింది. మిస్టర్ మజ్ను మూవీలో నిధి అగర్వాల్-అఖిల్ జంటగా నటించారు. ఈ మూవీ సైతం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ రూపంలో నిధి అగర్వాల్ కి సూపర్ హిట్ దక్కింది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని అందుకుంది. రామ్ పోతినేని కెరీర్లో ఇస్మార్ట్ శంకర్ బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి.
ఇస్మార్ట్ శంకర్ అనంతరం మరలా ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. తమిళ చిత్రాలు ఈశ్వరన్, భూమి నిరాశపరిచాయి. అలాగే మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన హీరో సైతం ఆకట్టుకోలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా నిధి అగర్వాల్ కి రెండు భారీ ప్రాజెక్ట్స్ దక్కాయి. ఒకటి హరి హర వీరమల్లు కాగా, మరొకటి రాజా సాబ్. పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు ఈ ఏడాది విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఈ మూవీ షూటింగ్ ఆలస్యమైంది.
ఇటీవల హరి హర వీరమల్లు షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. అలాగే ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజా సాబ్ మూవీలో నిధి అగర్వాల్ కూడా ఒక హీరోయిన్. ఈ రెండు చిత్రాలతో తన ఫేట్ మారుతుందని నిధి అగర్వాల్ భావిస్తుంది. పవన్, ప్రభాస్ భారీ ఫేమ్ ఉన్న హీరోలు కావడంతో రీచ్ దక్కుతుందనేది నిధి అగర్వాల్ ఆశ. కాగా నిధి అగర్వాల్ పోలీసులను ఆశ్రయించారు. తనను వేధిస్తున్న వ్యక్తిపై ఆమె ఫిర్యాదు చేశాడు.
ఓ నెటిజన్ నిధి అగర్వాల్ కి సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు పంపుతున్నాడట. వాటికి తనను ట్యాగ్ చేస్తున్నాడట. అలాగే తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తున్నాడట. సదరు వ్యక్తి వేధింపుల కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురవుతన్నాను. కుటుంబ సభ్యులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో కనుగొని, చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు నిధి అగర్వాల్ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.