https://oktelugu.com/

Phone tapping: ఫోన్ ట్యాపింగ్ లో మరో కోణం.. మైత్రి మూవీ మేకర్స్ అధినేతపై కేసు.. కారణం అదేనా..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఆయనతోపాటు ఇన్ స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్, ఇంకా పలువురి పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 15, 2024 / 02:31 PM IST

    Producer Naveen Yerneni named in FIR

    Follow us on

    Phone tapping: తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదుపుతున్న ఫోన్ ట్యా పింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తెలుగులో భారీ చిత్రాల నిర్మాతగా పేరుపొందిన మైత్రి మూవీ మేకర్స్ అధినేత యర్నేని నవీన్ పై నమోదైన కేసుకు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి తన పేరు మీద బలవంతంగా షేర్లను బదలాయింపు చేసుకున్నట్టు ఆయనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాజమాన్యం మార్పిడి విషయంలో ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తోంది. అందువల్లే ఈ కేసు జాబితాలో ఆయన పేరు ఉన్నట్టు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

    ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఆయనతోపాటు ఇన్ స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్, ఇంకా పలువురి పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ ఎన్ఆర్ఐ, వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్ జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించారు.. “ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారంతా నన్ను గతంలో బెదిరించారు. నన్ను అపహరించారు కూడా. నా కంపెనీకి సంబంధించిన షేర్లను బలవంతంగా రాయించుకున్నారు. ఈ వ్యవహారంలో రాధా కిషన్ రావు, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ, వేగే చంద్రశేఖర్ వంటి వారు ఉన్నారని” వేణుమాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఈ నేపథ్యంలో వేణుమాధవ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. “పోలీసులతోపాటు నా సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లకు సైతం లబ్ధి జరిగిందని” పోలీసులకు చేసిన ఫిర్యాదులో వేణుమాధవ్ పేర్కొన్నారు. అయితే ఈ కేసు పై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన తలసిల రాజశేఖర్, డైరెక్టర్లు గోపాలకృష్ణ సూరెడ్డి , నవీన్ యర్నేని, మందలపు రవికుమార్, వీరమాచినేని పూర్ణచందర్రావు ను నిందితుల జాబితాలో చేర్చారు.. కాగా, వేణుమాధవ్, చంద్రశేఖర్ మధ్య ఆర్థికపరమైన విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిపై గతంలో కేసులు కూడా నమోదయ్యాయని సమాచారం. ఇక చంద్రశేఖర్ మీద గతంలో పీడీ చట్టాన్ని ఉపయోగించి ఇబ్బంది పెట్టారని.. విచారణ సమయంలో దానిని అడ్వైజరీ బోర్డు తిరస్కరించినట్టు తెలుస్తోంది.