Homeఎంటర్టైన్మెంట్Peddi Premiere Show Review: 'పెద్ది' ప్రీమియర్ షో రివ్యూ : రామ్ చరణ్ నట...

Peddi Premiere Show Review: ‘పెద్ది’ ప్రీమియర్ షో రివ్యూ : రామ్ చరణ్ నట విశ్వరూపం.. కానీ సినిమాలో మిస్ అయ్యింది ఏమిటంటే..

Peddi Premiere Show Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా మొదలైంది. మొదటి నుండి ఈ సినిమా పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు వేరే లెవెల్ లో ఉండేవి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ వెళ్లాయి. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా దాదాపుగా 70 కోట్ల రూపాయిల గ్రాస్ వరకు వచ్చింది. అంతటి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది , డైరెక్టర్ బుచ్చి బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ అంచనాలను అందుకున్నారా లేదా అనేది ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

ఎలాంటి సౌకర్యాలు లేని విజయనగరం జిల్లా లోని ఒక మారుమూల గ్రామం. కనీసం ప్రయాణం చేయడానికి కూడా వీలు లేని ప్రాంతం. ఆ గ్రామం నుండి రైలు వెళ్తూ ఉంటుంది కానీ , ఆగదు. రైలు ప్రయాణం సౌకర్యం లేకపోవడం వల్ల మెరుగైన వైద్యం అందక ఎంతో మంది గ్రామస్తులు చనిపోతూ ఉంటారు. రైలు సౌకర్యం కోసం అప్పలసూరి (జగపతి బాబు) చేసే ప్రయాణం ఊహాతీతం. రైల్వే ట్రాక్ అవతల నిల్చొని ఎర్ర జెండా ని ఊపుతూ , రైలు ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు , కానీ పట్టించుకునే వాళ్ళు ఉండరు. కనీసం పేరు కూడా లేని ఊరు అది. అయితే ఆ ఊర్లో క్రికెట్ ఆటలో ఆరి తేరిన పెద్ది (రామ్ చరణ్) అనే కుర్రాడు ఉంటాడు. అందరూ అతన్ని ఆట కూలీ లెక్క వాడుకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అదే క్రమం లో ఆ ఊరి సర్పంచ్ కూతురు అచ్చియమ్మ(జాన్వీ కపూర్) తో ప్రేమలో పడుతాడు. ఒకరోజు ప్రత్యర్థి పార్టీ కి చెందిన వారు , జాన్వీ కపూర్ ని నిండు సభలో బట్టలు చించి అవమానిస్తారు.

ఆ సమయం లో పెద్ది అచ్చియమ్మ ని అవమానించిన వాళ్ళని చితక్కొడుతాడు. ఆ పగతో వాళ్ళు పెద్ది కి క్రికెట్ ఆటలో ఘోరమైన అవమానం చేస్తారు. కానీ పెద్ది ఆడిన ఆట తీరుని గుర్తించిన గౌర్ నాయుడు (శివరాజ్ కుమార్) అతనికి కుస్తీ పోటీ నేర్పిస్తానని ముందుకు వస్తాడు. కానీ పెద్ది మొదట్లో ఒప్పుకోడు. కట్ చేస్తే ఒకరోజు కొండని దాటుతున్న సమయం లో భారీ వర్షం వస్తుంది. ఆ సమయం లో కొన్ని కొండచరియలు విరిగి, జనాల మీద పడడంతో , ఒక కుర్రాడు చనిపోతాడు. అప్పుడు అప్పలసూరి ఎలా అయినా రైలు ని తమ ఊర్లో ఆపించే ప్రయత్నం గట్టిగా చెయ్యాలని నిర్ణయించుకొని రాజకీయ నాయకులను కలుస్తాడు. కానీ వాళ్ళు అప్పలసూరి ని అవమానించి , చితక్కొట్టి పంపుతారు. దీంతో అప్పలసూరి రైల్వే ట్రాక్ మధ్యలో నిల్చొని ఎర్ర జెండా ని ఊపుతూ రైలు ని ఆపే ప్రయత్నం చేసి చనిపోతాడు. దీంతో పెద్ది తన ఊరికి ఎలా అయినా గుర్తింపు తీసుకొని రావాలనే కసితో , అందుకు తన సొంతంగా ఆడే ఆట ద్వారా వచ్చే గుర్తింపే ముఖ్యం అని భావించి , కుస్తీ నేర్చుకోవడానికి వస్తాడు. ఈ ప్రయాణం లో అతను తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.

విశ్లేషణ :

ఈ చిత్రానికి ప్రధాన బలం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. వీళ్లిద్దరు లేకపోతే సినిమా డిజాస్టర్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. బలమైన కథకు బలహీనమైన స్క్రీన్ ప్లే తోడైతే , అది పెద్ది అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఆరంభంలో 20 నిమిషాలు చాలా గట్టిగానే వర్కౌట్ అయ్యింది. రామ్ చరణ్ పరిచయ సన్నివేశం , రయ్ రయ్ రారా పాట ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ లాగా అనిపించింది. ఇక ఆ తర్వాత హీరోయిన్ జాన్వీ కపూర్ ఎంట్రీ ఆడియన్స్ కి నరకప్రాయం లాగా అనిపిస్తుంది. మంచి టాలెంట్ , అందం ఉన్న నటిని , డైరెక్టర్ బుచ్చి బాబు కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిచయం చేశాడు . ఈమె ఎంట్రీ తర్వాత సినిమా బాగా డౌన్ అవుతుంది , కానీ చికిరి చికిరి పాట నుండి సినిమా మళ్లీ ఊపందుకుంటుంది, ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే ఎమోషనల్ సన్నివేశం మాస్టర్ క్లాస్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ గా మనకి ఇంటర్వెల్ పడేలోపు మంచి సినిమా చూశాము అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది.

కానీ రామ్ చరణ్ ఆట మార్చినప్పటి నుండే ఈ సినిమా కాస్త డౌన్ అవుతుంది. కుస్తీ నేర్చుకొని , నేషనల్ లెవెల్ పోటీల్లో పాల్గొనాలనే లక్ష్యం తో ఉంటాడు రామ్ చరణ్. కుస్తీ పోరాట సన్నివేశాలన్నీ వేరే లెవెల్ లో ఉంటాయి , రామ్ చరణ్ పాపం చాలా కష్టపడి నటించాడు, కేవలం ఈ సన్నివేశాల కోసం ఆయన తన శరీరాన్ని మలుచుకున్న తీరుని చూస్తే సెల్యూట్ చేయాల్సిందే. అయితే కుస్తీ ఫైటింగ్ తోనే ఈ సినిమాని కొనసాగించి ఉండుంటే బాగుండేది. కానీ వైవిద్యం కోసం బుచ్చి బాబు ప్రీ క్లైమాక్స్ లో పెట్టిన మెలిక ఆడియన్స్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. కానీ క్లైమాక్స్ లో రామ్ చరణ్ ఇచ్చే ఎమోషనల్ ప్రసంగం మాత్రం వేరే లెవెల్ లో అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ చరణ్ మరియు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాని నిలబెట్టేసారు. బుచ్చి బాబు స్క్రీన్ ప్లే సరిగా రాసుకొని ఉండుంటే వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఈ చిత్రానికి ఉండేది.

ప్లస్సులు :

–> రామ్ చరణ్ నటన
–> ఏఆర్ రెహమాన్ సంగీతం
–> ప్రీ ఇంటర్వెల్ – ఇంటర్వల్ ఎమోషనల్ సన్నివేశాలు
–> క్లైమాక్స్

మైనస్సులు :

–> స్క్రీన్ ప్లే
–> రొటీన్ స్టోరీ
—> హీరోయిన్ జాన్వీ కపూర్
–> సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు

చివరి మాట : ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే , రామ్ చరణ్ అద్భుతమైన నటన కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూసేయొచ్చు, కానీ అంచనాలు తక్కువగా పెట్టుకొని వెళ్తే మంచిది.

రివ్యూ : 2.5/5

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version