Peddi Movie Review: రివ్యూ: పెద్ది
నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్,, జగపతి బాబు, బొమన్ ఇరానీ తదితరులు
సంగీత దర్శకుడు: ఏ.ఆర్. రెహమాన్
ఛాయాగ్రహణం: ఆర్. రత్నవేలు
ఎడిటర్: నవీన్ నూలి
దర్శకుడు: బుచ్చిబాబు సానా
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా తర్వాత పక్కా పల్లెటూరి ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ ఉండడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. పైగా ఇది’ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా కావడంతో’పెద్ది’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. స్పోర్ట్స్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం, జాన్వి కపూర్ లాంటి ప్యాన్ ఇండియా హీరోయిన్, ఏఆర్ రెహమాన్ లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ పెద్ద అన్నట్టుండే ఈ కాంబినేషన్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచడం పెద్ద విషయమేమీ కాదు. ఇలాంటి స్పెషాలిటీస్ ఉన్న ఈ సినిమా చరణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిందా? బుచ్చిబాబు తన రెండో సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడా? చరణ్ లాంటి స్టార్ హీరోను ఒక హై బడ్జెట్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు ప్రెజెంట్ చేయగలిగాడా అనేది మనం రివ్యూ లో చూద్దాం.
గ్రామీణ నేపథ్యంలో సాగే పక్కా లోకల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అనే ఫీల్ ఇస్తూనే మెల్లిగా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ పోటీల వరకూ తీసుకెళ్ళే సినిమా ఇది. కొండ కింద ఊరు ఆనే ప్రభుత్వం అస్సలే గుర్తించని ఊరిలో, ప్రజలకు ఐడెంటిటీ అంటూ ఏమీ లేని ప్రజలు ఉండే ఊరిలో పెద్ది (రామ్ చరణ్) క్రికెట్ ఆటలో ఒక కూలీ. అయితే కూలి పనులు చేసుకుంటూనే క్రికెట్ ఆటలో ప్రతిభ కనబరుస్తూ ఉంటాడు. తన ప్రతిభతో విజయనగరం, బొబ్బిలి టీమ్ ల మధ్యలో క్రికెట్ పోటీలు జరిగినప్పుడు ఆట కూలీగా అవతారం ఎత్తుతాడు. అంటే ఎవరు వేలం పాట పాడుకుంటే వారి టీమ్ లో ఆడి ఆ జట్టును గెలిపించే ఒక యువకుడు. ఇలా కొంత కాలం జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల అవమానాల పాలు కావలసి వస్తుంది. అప్పుడు కూలీ కోసం అట ఆడకూడదు, ఆట కోసం ఆట ఆడాలి ఆనే గౌరు నాయుడు(శివరాజ్ కుమార్) మాటలకు ప్రభావితుడై కుస్తీ పోటీలలో పాల్గొనాలని నిర్ణయించుకుంటాడు. క్రికెట్ కు బై బై చెప్పి గౌరునాయుడి దగ్గర కుస్తీలో శిష్యరికం చేయడానికి వెళతాడు. ఇదే సమయంలో తమ గ్రామ గుర్తింపు, గ్రామస్తుల గుర్తింపుకై జీవితాంతం తపన పడిన పోరాటం చేసిన వ్యక్తి అప్పల దాసు(జగపతి బాబు) చేసిన ప్రాణత్యాగం పెద్ది జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. తర్వాత పెద్ది తన గ్రామస్తుల గుర్తింపు, తన గ్రామం గుర్తింపు కోసం ఏం చేశాడు? ఎంత దూరం వెళ్ళాడు అనేది మిగతా కథ. ఈ కథలో ఒక సబ్ ప్లాట్ లాగా అచ్చాయమ్మ (జాన్వీ కపూర్) తో ప్రేమ కథ కూడా ఉంటుంది.
ఇన్ని కోట్ల మంది ఉండే భారత దేశంలో మనకు ఒలింపిక్స్ లో జనాభాకు తగ్గట్టు పతకాలు రావడం లేదు అంటూ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మీటింగ్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ మీటింగ్ లో ఉండేవారిలో బొమన్ ఇరానీ మాట్లాడుతూ మనకు ఈ సారి రెండు పతకాలు వచ్చాయి అంటాడు. అప్పుడు ఇంత జనాభాకు రెండే పతకాలా.. ఇలా అయితే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ రద్దు చేసి ఆ ఫండింగ్ మిలిటరీకి మళ్లించాల్సి ఉంటుంది అని స్పోర్ట్స్ మినిస్టర్ వార్నింగ్ ఇవ్వడంతో కథ ప్రారంభం అవుతుంది. దీంతో బొమన్ ఇరానీ ఏం చేస్తే ఇండియాకు పతకాలు వస్తాయి అని వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం కోసం తన ప్రయాణం ప్రారంభిస్తాడు. ఆంధ్ర ప్రదేశ్ కు వస్తాడు. అక్కడే పెద్ది పాత్ర ఎంటర్ అవుతుంది. బొమన్ ఇరానీ పెద్ది గురించి తెలుసుకుంటూ వెళతాడు. సినిమా క్లైమాక్స్ కు పెద్ది ప్రయాణం గురించి పూర్తిగా తెలుస్తుంది.
ఫస్ట్ హాఫ్ అంతా పెద్ది గురించి, పెద్ది టాలెంట్ గురించి ఎస్టాబ్లిష్ చేయడంతో సరిపోతుంది. ఒక మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ తో బ్రేక్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ హాఫ్ ఆంతా కమర్షియల్ టెంప్లేట్ తో హీరో ఎలివేషన్స్ తో సాగుతుంది. నిజానికి ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ట్విస్ట్ తప్ప మిగతా అంతా సాదాసీదాగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి స్పోర్ట్స్ డ్రామా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. సెంటిమెంట్ డోస్ కాస్త పెరగడం వల్ల కొన్ని చోట్ల కథనం నెమ్మదించినట్లు అనిపించినా, కొన్ని సన్నివేశాలు కాస్త లెంగ్తీగా అనిపించినా, ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ లో వచ్చే హై-వోల్టేజ్ ఎమోషనల్ సీన్స్ సినిమాను మళ్లీ ట్రాక్‌లోకి తెస్తాయి. స్క్రీన్‌ప్లే అక్కడక్కడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో సాగినప్పటికీ, కథనం ఎగుడుదిగుడుగా అనిపించినా ఓవరాల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది.
రామ్ చరణ్ ‘పెద్ది’ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ పాత్ర కోసం చరణ్ పడ్డ కష్టం, మేకోవర్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. రెజ్లింగ్ సీన్స్‌లో, ఎమోషనల్ డైలాగ్స్ చెప్పేటప్పుడు చరణ్ నటన నెక్ట్స్ లెవెల్ అని చెప్పొచ్చు. నిజానికి సినిమా చాలా చోట్ల బోరింగ్ అనిపించినా చరణ్ నటన, తన మేకోవర్ వల్ల ఆ లోపాలన్నీ కవర్ అయినట్టు ఉంటాయి. ఈ సినిమాలో హీరో పాత్ర చాలా బలంగా ఉంది కానీ జాన్వీ కపూర్ పాత్ర మాత్రం ఉన్నా లేకపోయినా ఒకటే. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను ఇరికించినట్టు అనిపిస్తే అది ప్రేక్షకుల తప్పేమీ కాదు. పైగా జాన్వీ పల్లెటూరి అమ్మాయిగా సూట్ కాలేదు. క్యారెక్టరైజేషన్ కూడా బలహీనంగా ఉంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఒక పెద్ద అసెట్. అయితే ప్రీ క్లైమాక్స్ వరకూ శివరాజ్ కుమార్ పాత్ర బలంగా ఉన్నప్పటికీ క్లైమాక్స్ వచ్చేసరికి పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రగా మారిపోతుంది. గ్రామం కోసం తపన పడే వ్యక్తిగా జగపతి బాబు తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. సినిమాలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యే పాత్రలను మాత్రం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.
ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం అద్భుతంగా అయితే లేదు. రెండు పాటలు బాగున్నాయి. మిగతావి యావరేజ్. నేపథ్య సంగీతం విషయానికి వస్తే కొన్ని చోట్ల గొప్పగా ఉంది కానీ కొన్ని చోట్ల మాత్రం చప్పగా ఉంది. ఓవరాల్ గా చెప్తే అత్తెసరు మార్కులే ఇవ్వాలి. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, ప్రతి విజువల్ చాలా రిచ్‌గా, సహజంగా ఉంటూ గ్రామీణ అందాలను, యాక్షన్ సీన్స్‌ని అద్భుతంగా క్యాప్చర్ చేసింది. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకొంత షార్ప్ గా ఉండాల్సింది, సెకండ్ హాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లను కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. మూడు గంటల 9 నిముషాల నిడివి ఎక్కువే అని చెప్పాలి. ఇక రైటింగ్ విషయానికి వస్తే కొన్ని డైలాగులు బాగున్నాయి కానీ స్క్రీన్ ప్లే లోపాల వల్ల సినిమా అంతా ఒక ఫ్లో లో ఉన్నట్టు అనిపించదు. చాలా చోట్ల లాజిక్ లను గాలికి వదిలేశారు. సినిమాటిక్ లిబర్టీ వీలైనంత ఎక్కువ తీసేసుకున్నారు. లాజిక్ లను పట్టి పట్టి చూసే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చడం కష్టమే. లాజిక్ లను పక్కన పెట్టి కమర్షియల్ సినిమా ను ఎంజాయ్ చేద్దాం అనేవారికి పెద్ద ఇబ్బంది ఉండదు.
సినిమాలో ఏం బాగున్నాయో తెలుసా?
1. రామ్ చరణ్ వన్-మ్యాన్ షో & మేకోవర్
2. ఇంటర్వెల్ బ్యాంగ్ , ప్రీ క్లైమాక్స్ నుంచి చివర వచ్చే షాకింగ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్
3. రత్నవేలు విజువల్స్
సినిమాలో బాగలేనివి ఇవి:
1. జాన్వి కపూర్ లవ్ ట్రాక్
2. రొటీన్ ఫస్ట్ హాఫ్
3. చాలా చోట్ల ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం
రేటింగ్: 2.5 / 5
ఫైనల్ వర్డ్: పెద్ది కాదు కమర్షియల్ చద్ది!
