Pawan Kalyan : ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని గట్టి వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ప్రజల వద్ద తాను ఎలాంటి వాడో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారో .. ప్రజల బాగు కోసం ఎలా పాటుపడుతున్నారో తాజాగా ఓ ప్రచార కార్యక్రమంలో వెల్లడించారు. తన గొప్ప మనసు అర్థం చేసుకుని ప్రజలు తన వెంట ఉండి గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. రాజకీయాల్లోకి ఎన్నో విలువలతో వచ్చానని అన్నారు. గత ఎన్నికల్లో తనను ఆదరించకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశాను అని అన్నారు. ఇక తన క్యారెక్టర్ గురించి వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు స్టార్స్ అందరూ ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. నేను మాత్రం ఏ సంస్థ కు యాడ్ చేయడం లేదు.
గతంలో నేను కోకో కోలా కంపెనీకి యాడ్ చేశాను. అదే నా మొదటి ఇంకా చివరి యాడ్. కోకో కోలా వల్ల హెల్త్ సమస్యలు వస్తాయని నాకు తెలిసిన తర్వాత యాడ్ చేయనని చెప్పేశా. ఆ యాడ్ చేస్తే నాకు షారుక్ ఖాన్ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తాం అని కంపెనీ వాళ్ళు చెప్పారు. జనాలకు హాని కలిగే ఆ యాడ్ చేయకూడదు అని వాళ్ళ ఆఫర్ రిజెక్ట్ చేశా. ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ యాడ్ చేయమని అడిగారు.
నేను డబ్బుల కోసం ఆ యాడ్స్ చేసి ఉంటే ఇప్పటికే బోలెడంత డబ్బు సంపాదించేవాడిని అని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసే వ్యక్తిని అని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా వంగ గీత ఉన్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పలువురు సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు.