Pawan Kalyan- NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు ప్రకటించినట్లు ఒక వార్త హల్చల్ చేస్తుంది. పవన్ సీఎం కావాలని ఆయన కోరుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించారు. గత అనుభవాల రీత్యా రానున్న సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. జనసేన కార్యకర్తలలో ఉత్తేజం నింపుతూ వారిని వ్యవస్థీకృతం చేస్తున్నారు. జనసేన పార్టీని బలంగా జనాల్లోకి తీసుకెళ్లి వాళ్ళ నమ్మకం సాధించేందుకు కృషి చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రజల్లోనే ఉంటున్నారు.

పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు కోరుకుంటున్నారు. ఆయన సీఎం సీటు అధిరోహిస్తే చూడాలని ఆశ పడుతున్నారు. ఉన్నత భావాలు కలిగిన పవన్ కళ్యాణ్ సీఎం గా ప్రజలకు మంచి చేస్తాడని నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కి తన మద్దతు ప్రకటించినట్లు ఒక వార్త వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ సన్నిహితులతో అన్నారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నాయి.
టీడీపీకి చెందిన ఎన్టీఆర్ జనసేన అధినేతకు మద్దతు ప్రకటించడం నిజంగా ఊహించని పరిణామం. పవన్ తర్వాత ఆ రేంజ్ పొలిటికల్ ఫేమ్ ఉన్న హీరో ఎన్టీఆర్ అని చెప్పొచ్చు.ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తాత స్థాపించిన టీడీపీ పగ్గాలు చేపట్టాలని డై హార్డ్ ఫ్యాన్స్ అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. 2019లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత ఈ డిమాండ్ మరింత పెరిగింది. టీడీపీ వారసుడిగా లోకేష్ ని చంద్రబాబు పరోక్షంగా ప్రకటించిన తరుణంలో ఎన్టీఆర్ కి మాత్రమే ఆ సమర్థత ఉంది అంటున్నారు.

కాగా రెండు రోజుల క్రితం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ని నారా చంద్రబాబు నాయుడు కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాడతాం అన్నారు. దీంతో పొత్తు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. జనసేన-టీడీపీ కలిసి 2024 ఎన్నికలకు వెళ్లడం లాంఛనమే అంటున్నారు. టీడీపీతో పొత్తుపై జనసేన కార్యకర్తల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. పొత్తు వద్దు, ఒకవేళ పెట్టుకుంటే సీఎం అభ్యర్థిగా పవన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.