Pawan Kalyan- Venkatesh: టాలీవుడ్ లో స్టార్ హీరోలు వెంకటేశ్, పవన్ కళ్యాణ్ ల అనుబంధం గురించి అందరికీ తెలిసిందే.. వెంకీ అంటే పవన్ కు ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే ‘గోపాల గోపాల’చిత్రంలో ఇద్దరూ కలిసి నటించాడు. సామాన్యుడిగా వెంకటేశ్, దేవుడు శ్రీకృష్ణుడిగా పవన్ నటించి అలరించారు. ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులు దేవుళ్లుగా వేర్వేరుగా నటిస్తుండడం విశేషం.

తమిళంలో హిట్ అయిన ‘ఓ మై కడపులే’ రిమేక్ లో వెంకటేశ్ దేవుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్,మిథిలా ఫాల్కర్ హీరో హీరోయిన్లు. తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన దేవుడి పాత్రను తెలుగులో వెంకటేశ్ చేస్తున్నాడు. జీవితంలో తప్పులను సరిదిద్దుకోవడానికి హీరో పాత్రధారికి అవకాశం ఇచ్చే దేవుడి పాత్రను వెంకటేశ్ అద్భుతంగా పోషించాడని.. ఈ మేరకు షూటింగ్ కూడా పూర్తయినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని తమిళ సినిమా చేసిన దర్శకుడు అశ్వత్ మారిముత్తునే తెలుగులో తెరకెక్కిస్తున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ కూడా తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కోసం దేవుడి అవతారం ఎత్తాడు. తమిళంలో దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వంలో తీసిన ‘వినోదయ సీతం’లో దేవుడిగా పవన్ కళ్యాణ్,సామాన్యుడిగా సాయిధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఇక్కడా సేమ్ కాన్సెప్ట్ నే. అయితే కథాంశాలు వేరు. పవన్ కళ్యాణ్ దేవుడిగా సాయిధరమ్ తేజ్ తప్పులను ఎలా సరిదిద్దాడన్నది చూపించారు.

మొత్తంగా ఇండస్ట్రీలోని ఇద్దరు స్టార్ హీరోలు.. రెండు తమిళ సినిమాలను రిమేక్ చేయడం.. వెంకీ, పవన్ లు దేవుడి పాత్రలే పోషించడం యాధృశ్చికంగా చోటుచేసుకుంది. మరి దేవుడి పాత్రల్లో వెంకీ బాగా చేశాడా? పవన్ ఇరగదీశాడా? దేవుడిగా గెలిచేదెవరు? అన్నది మనం తెరపైనే చూడాలి.