Pawan Kalyan: ఎక్కడో నల్లమల అడవుల్లో సంప్రదాయ వాయిద్యాలతో పాటలు పాడుకునే ‘కిన్నెర కళాకారుడు’ మొగులయ్య గురించి మొన్నటి వరకు ఎవరికీ తెలియదు.. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన్ను గుర్తించాడు. గుర్తించడమే కాదు.. తన సినిమాల్లో పాట పాడే అవకాశం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఆర్థిక సాయం కూడా చేశాడు..
జానపదం అంటే పవన్ కళ్యాణ్ కు ప్రాణపదం.. ఆయన ప్రతీ సినిమాలోనూ కనమరుగైపోతున్న తెలుగు జానపదాలను ఏర్చి కూర్చి తన సినిమాల్లో ఆలపించి గుర్తింపునిస్తుంటాడు. ఆ కళాకారులను పైకి తీసుకొస్తుంటాడు. ‘ఖుషీ’ నుంచి నేటి ‘బీమ్లా నాయక్’ వరకు ఏపీ, తెలంగాణలోని కళాకారుల జానపద గేయాలు ఖచ్చితంగా ఉండేలా పవన్ చూసుకుంటాడు. ఆ కళను బతికించేందుకు కళాకారులను ఆదుకునే విషయంలో పవన్ ఎప్పుడూ వెనకడుగు వేయడు.
తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమాలోని టైటిల్ సాంగ్ ను కిన్నెర కళాకారుడు మొగులయ్యతో పవన్ పాడించాడు. ఈ గొప్ప అవకాశాన్ని ఇవ్వడమే కాదు.. అంతటితో ఊరుకోకుండా రూ.2 లక్షల ఆర్థిక సాయం తాజాగా ప్రకటించి మొగలయ్య ఆర్థిక కష్టాలు కూడా తీర్చాడు. పవన్ చేసిన పనిపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి.
‘భీమ్లా నాయక్’ను పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మొగులయ్యకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తునట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపన పవన్ కల్యాణ్ లో ఎప్పటి నుంచో ఉంది.
ఈ క్రమంలోనే మొగులయ్య కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపించడాన్ని పవన్ చూసి ఆయన టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయాలని భావించాడు. తన ‘భీమ్లా నాయక్’ సినిమాలో అవకాశం కల్పించాడు. తాజాగా పవన్ కల్యాణ్ తన ట్రస్టు ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్’ ద్వారా రూ.2 లక్షలు మొగులయ్యకు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యాలయ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన చెక్కును మొగులయ్య అందచేస్తారు.