huzurabad bypoll : వారూ వీరు అనే తేడా లేకుండా తెలంగాణలోని రాజకీయ నాయకులు, పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఏదైనా ఉందంటే.. అది హుజూరాబాద్ ఉప ఎన్నికే. రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పేదిగా భావిస్తున్న ఈ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందా? ఎలాంటి ఫలితం వస్తుందా? అని సామాన్యులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. ఔను మరి.. హుజూరాబాద్ లో జరిగే యుద్ధం అలాంటిది. ఈ సమరంలో ఆరు నూరైనా గెలిచేందుకు అధికార, విపక్షాలు ఏ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేసీఆర్, ఈటల రాజేందర్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అలాంటి ఉప ఎన్నికకు సంబంధించి.. ఉత్కంఠను మరికొంత కాలం కొనసాగేలా ఉత్తర్వులు వెలువరించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పట్లో ఎన్నిక నిర్వహించే అవకాశం లేదని ఈసీ పేర్కొనడంతో అందరూ షాక్ తిన్నారు.
ఈటల వర్సెస్ కేసీఆర్ అన్న తీరుగా సాగుతున్న హుజూరాబాద్ పోరాటంలో గెలిచేందుకు ఇద్దరూ తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా నేను సైతం అంటోంది. అయితే.. దశాబ్దాలుగా హుజూరాబాద్‌లో పాతుకుపోయిన ఈటలను పెకిలించడం అంత తేలిక కాదనే అభిప్రాయం మొదటి నుంచీ వ్యక్తమవుతోంది. అందుకే.. కేసీఆర్ దళిత బంధు వంటి పథకాలను, ఇతరత్రా అస్త్రాలను సంధించారు. అయితే.. దళితబంధు పథకం రెండువైపులా పదునున్న కత్తిలా తయారైంది. సరిగ్గా ఉపయోగించకపోతే.. ప్రయోగించిన వారికే ప్రమాదం తెచ్చిపెట్టేలా మారిపోయింది. హుజూరాబాద్ లో దళిత ఓటర్లను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన ఈ పథకాన్ని.. మిగిలిన వారికి కూడా వర్తింపజేయాలని విపక్షాలు డిమాండ్ చేయడం మొదలు పెట్టాయి. ఈ డిమాండ్ కు జనాల్లో కదలిక కూడా వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అవును మరి.. పది లక్షల రూపాయలు వచ్చిపడతాయంటే.. ఎవరు మాత్రం వద్దంటారు?
అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కలిసి దళిత బంధుతోనే కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం మొదలు పెట్టాయి.. కొనసాగిస్తున్నాయి కూడా. కేవలం హుజూరబాద్ కోసమే ఈ పథకం తెచ్చారని, ఈ గండం దాటితే పథకం అటకెక్కుతుందని, జనాలు ఆలోచించాలని చెబుతుతూ వస్తున్నాయి. ఇదేదో తేడాగా ఉందని భావించిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని మరో నాలుగు నియోజకవర్గాల్లోని, నాలుగు మండలాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ.. హుజూరాబాద్ లో కేసీఆర్ ఆశించిన లక్ష్యం ఎంత వరకు నెరవేరుతుంది? అనే సందేహం అలాగే ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో.. ఈ వేడిని చల్లార్చడం ద్వారా వ్యతిరేక ప్రచారానికి విరామం ఇవ్వొచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ మధ్య.. ఉప ఎన్నిక నిర్వహణకోసం రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయా? అని కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నకు.. రాష్ట్రం నుంచి ‘లేవు’ అని సమాధానం వెళ్లడం గమనార్హం. ఇక, ప్రధాన మంత్రితో సీఎం కేసీఆర్ భేటీ అయిన మర్నాడే.. ఉప ఎన్నిక ప్రకటన రావడంపట్ల పలురకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి.
కరోనా పరిస్థితులను కారణంగా చూపినా.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ కేసులే నమోదవుతున్నాయి. దసరా పండగను బెంగాల్లో కూడా భారీగా జరుపుకుంటారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అయినా.. బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించగా లేనిది.. తెలంగాణలో ఎందుకు నిర్వహించలేరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
హుజూరాబాద్ లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లనే ప్రభుత్వం ఉప ఎన్నికకు నో చెప్పిందా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నేతలు. ఇటు బండి సంజయ్ పాదయాత్రతో జనాల్లోకి వెళ్లిపోయారు. అటు రేవంత్ కూడా దళిత సభలను నిర్వహిస్తూ దాడి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. హుజూరాబాద్ ఎన్నికను సాధ్యమైనంత వరకు వాయిదా వేయాలనే టీఆర్ ఎస్ కోరుకుంటోందని చెబుతున్నారు పరిశీలకులు.