
పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ‘వకీల్ సాబ్’. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరుతున్నాయి. మేకర్స్ కూడా ప్రమోషన్ స్పీడ్ పెంచి, చిత్రానికి సంబంధించిన పలు సీక్రెట్స్ రివీల్ చేస్తున్నారు. లేటెస్ట్ గా దర్శకుడు శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ పేరు వకీల్ సాబ్ కాదని ప్రకటించాడు.
వకీల్ సాబ్ సినిమా.. బాలీవుడ్ చిత్రం ‘పింక్’ రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. న్యాయం కోసం పోరాడుతున్న ముగ్గురు మహిళల కథ ఇది. ఒరిజినల్ లో కేవలం భావోద్వేగ ప్రధానంగా సాగిన ఈ చిత్రంలో.. పవన్ నటించాల్సి రావడంతో వాణిజ్య అంశాలకు కూడా పెద్దపీట వేయాల్సి వచ్చింది.
పవన్ కల్యాణ్ ఇమేజ్, అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్టులో చాలా మార్పులు చేసినట్టు చెప్పారు దర్శకుడు. అయితే.. ఒరిజినల్ లోని ఆత్మను టచ్ చేయకుండా.. పవన్ ను దృష్టిలో పెట్టుకొని కథలో మార్పులు చేర్పులు చేసినట్టు తెలిపారు. న్యాయం కోసం పోరాడుతున్న మహిళల కోణం నుంచి మొదలయ్యే కథ.. పవన్ సెంటర్ అయ్యేలా సాగుతుందని తెలిపారు.
కాగా.. ఈ చిత్రంలో పవన్ పేరు మాత్రం అందరూ అనుకుంటున్నట్టుగా వకీల్ సాబ్ కాదని చెప్పారు శ్రీరామ్ వేణు. ఈ సినిమాలో పవర్ స్టార్ పేరు ‘సత్యదేవ్’ అని వెల్లడించారు. అయితే.. పక్కన ఉండేవారు ఆయన్ను వకీల్ సాబ్ అని పిలుస్తుంటారని చెప్పారు. కాగా.. అలా ఎందుకు పిలవాల్సి వస్తుందనేది సినిమా చూసిన తర్వాత తెలుస్తుందన్నారు. దిల్ రాజు – బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. థమన్ స్వరాలు సమకూర్చారు.