
‘ఎన్టీఆర్’ అంటే… ఆయన తోటి హీరోలకు కూడా ఎంతో అభిమానం. కొన్నాళ్ల పాటు ఎన్టీఆర్ తో పోటీకి దిగిన కృష్ణ కూడా పర్సనల్ గా ఎన్టీఆర్ కి వీరాభిమాని. అలా అని ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు సరి కదా.. ఎన్టీఆర్ కి తానే పోటీ అని.. పైగా తెలుగులో నెంబర్ వన్ హీరో తానే అని కృష్ణ తన సినిమాకి ఏకంగా అలాంటి టైటిల్ ను కూడా పెట్టుకున్నాడు. దీనిబట్టి ఎన్టీఆర్ – కృష్ణ మధ్య ఏ స్థాయిలో పోటీ ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. .
అయితే వాళ్ళ మధ్య అంత పోటీ ఉన్నా… ఎన్టీఆర్ ను కృష్ణ చివరివరకూ అభిమానించారు. అందుకే, తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తో సొంత సినిమా తీయాలనుందని కృష్ణ విజయవాడలో జరిగిన ‘పండంటి కాపురం’ చిత్ర శతదినోత్సవ సభలో అభిమానుల సాక్షిగా చెప్పారు కృష్ణ. అదే వేదిక పైన ఉన్న ఎన్టీఆర్ కూడా లేచి వచ్చి.. మా బ్రదర్ సినిమాలో మేము నటిస్తున్నాం అంటూ అక్కడే అప్పటికప్పుడే ఎన్టీఆర్ కృష్ణ ప్రపోజల్ ను ఆమోదించారు. పైగా మద్రాసుకు వెళ్లాక ఎన్టీఆర్, కృష్ణకు ఫోన్ చేసి, ‘బ్రదర్.. సినిమా చేస్తానన్నారు కదా. మేం రెడీ’ అని చెప్పారు.
కృష్ణ వెంటనే రచయిత మోదుకూరి జాన్సన్ తో కథను సిద్ధం చేయించారు. కథను ఎన్టీఆర్ కు వినిపించాలనుకున్న సమయంలో సరిగ్గా ‘జై ఆంధ్రా’ ఉద్యమం తీవ్ర స్థాయిలో లేచింది. అనుకోకుండా కృష్ణ ‘జై ఆంధ్రా’ ఉద్యమానికి మద్దతు పలికారు. అయితే ఆ ఉద్యమ విషయంలో తటస్థంగా ఉన్న ఎన్టీఆర్ కు అది బాగా ఇబ్బంది కలిగించింది. దాంతో కృష్ణ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూసి ఎన్టీఆర్ మండిపడ్డారు.
గుమ్మడి, నాగభూషణంలను తన ఇంటికి పిలిపించుకుని మరీ.. ‘ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి కృష్ణ జై ఆంధ్రా ఉద్యమానికి ఎవర్నడిగి మద్దతు ప్రకటించాడు? వివాదాస్పదమైన ప్రకటనలు చేసేటప్పుడు అందరినీ సంప్రదించాలి కదా. కృష్ణ ప్రకటన వల్ల నాగేశ్వరరావుగారి సెట్ కి వెళ్లి స్టూడెంట్స్ గోల చేశారు. అలాగే మా ఇంటి ముందు ధర్నా చేశారు. కృష్ణ చేసిన పని బాగోలేదు అంటూ మూవీ అసోసియేషన్ నుండి ఎన్టీఆర్ అప్పటికప్పుడే తప్పుకున్నారు. పైగా కృష్ణతో చేయాలనుకున్న సినిమాని కూడా రద్దు చేసుకున్నారు.