Pawan Kalyan Biography: టాలీవుడ్లో తనకంటూ పవర్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అగ్రనటుడు పవన్ కల్యాన్. మెగా స్టార్ తమ్ముడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా తన సొంత చరిష్మాతో అన్నయ్యను మించిన తమ్ముడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తన కెరీర్ లో దాదాపు ఐదారేళ్లు ఒక్క సూపర్ హిట్ సినిమా లేకపోయినా అభిమానుల్లో తన స్థానం ఏ మాత్రం చెరిగిపోకుండా తన ఇమేజ్ ను కాపాడుకున్నాడు. దాదాపు ఐదేళ్లు సినిమాలకు దూరంగా తనలో పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడీ మెగా బ్రదర్. తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, మార్షల్ ఆర్ట్స్లలో ప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, రాజకీయ నాయకుడుగా పవన్ విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు, అంజనాదేవి. 1968 సెప్టెంబరు 2న బాపట్లలో పవన్ కళ్యాణ్ జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. తెలుగు సినిమా అగ్ర నటుడుగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవికి పవన్ తమ్ముడు. నటుడు, నిర్మాత కొణిదెల నాగేంద్ర బాబు పవన్‌కు రెండో అన్నయ్య. సినిమా పరిశ్రమలో అగ్రహీరోగా ఎదిగిన చిరంజీవిని చూసి నటన పట్ల పవన్ ఆసక్తిని పెంచుకున్నాడు. ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.
1996లో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ద్వారా కల్యాణ్ బాబుగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అనంతరం ‘గోకులంలో సీత’ చిత్రం ద్వారా స్క్రీన్ నేమ్ ను పవన్ కల్యాణ్ గా మార్చుకొని వరుస విజయాలతో సక్సెస్ సాధించాడు. ‘సుస్వాగతం’లో స్వచ్ఛమైన ప్రేమికుడిగా అభిమానుల ఆదరణను సొంతం చేసుకున్నాడు. సుస్వాగతం సూపర్ హిట్ అయినా మెగా స్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇమేజ్ నుంచి బయటకు రాలేకపోయాడు. అనంతరం 1998లో కరుణాకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘తొలిప్రేమ’ సినిమా ద్వారా తనకంటూ స్పెషల్ ఈమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమా తో తన అసలైన సినిమా కెరీర్ మొదలైందని చెప్పవచ్చు. ప్రేమకథా చిత్రాల్లో తొలిప్రేమ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మూస ధోరణితో సాగుతున్న టాలీవుడ్ ను ఈ సినిమా మలుపు తిప్పింది. జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పవన్ కల్యాన్ యూత్ ఐకాన్ గా మారాడు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యమున్న పవన్ కల్యాన్ కిక్ బాక్సింగ్ నేపథ్యంలో 1999లో పీఏ అరుణ్ ప్రసాద్ కు తమ్ముడు సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రంతో టాలీవుడ్ ను శాసించే స్థాయికి ఎదిగాడు పవన్ కల్యాన్. 2000 బద్రి సినిమాతో ప్రస్తుత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాతో పవన్ కల్యాన్ తెలుగు సినిమాకు కొత్త హీరోయిజం పరిచయం చేశాడు. తన కంటూ ఒక ప్రత్యేక స్టైల్ ను క్రియేట్ చేసుకున్నాడు. 2001 లో ఖుషీ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. హ్యాట్రిక్ విజయాలతో పవర్ స్టార్ గా ఎదిగాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత 2003 లో భారీ అంచనాలతో వచ్చిన జానీ సినిమా అంతే డిజాస్టర్ గా నిలిచింది. చాలా రోజుల తర్వాత ఒక హీరో డ్రెస్సింగ్ ఫాలో అయ్యింది ఈ సినిమాతోనే. జానీలో వేసిన కట్ బనిన్లు. హెడ్ బాండ్, చిరిగిపోయిన జీన్స్ కూడా ఫ్యాషన్ గా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. అప్పటి నుంచి మళ్లీ 2012 వరకు ఒక్క సూపర్ హిట్ కూడా లేదు. 2012లో గబ్బర్ సింగ్ లో మళ్లీ తన హవాను కొనసాగించాడు. గబ్బర్ సింగ్ కు గాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నాడు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం వసూళ్లలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని అంటారు. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మించాడు. 2015లో ‘గోపాల గోపాల’ చిత్రంలో మోడరన్ కృష్ణునిగా నటించాడు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2016 ప్రారంభంలో కాటమరాయుడు సినిమాలలో నటించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ చిత్రం ఆజ్ఞాతవాసిలో నటించాడు. 2022లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ మంచి విజయం సాధించింది.
తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. తన చిత్రాలకి, చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్ లని అతనే రూపొందించాడు. తమ్ముడు చిత్రంలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ పాటను పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా రూపొందించాడు. బద్రి చిత్రంలో మేరా దేశ్ హై ప్యారా ప్యారా తెలుగు, హిందీ, ఆంగ్లంల కలయికతో త్రిభాషా గీతంగా, ఖుషిలో యే మేరా జహాన్ గీతాన్ని పూర్తి నిడివి హిందీ గీతంగా రూపొందించాడు. ఖుషి చిత్రంలో ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే, జానీ చిత్రంలో ఈ రేయి తీయనిది పాటలని రీ-మిక్స్ చేయించారు.
ఖుషి లోని ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రతిభకు తార్కాణం. మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట కావటంతో ఇతని చిత్రాలలో చాలా స్టంట్ లు నిజంగానే చేసినవే ఉంటాయి. అటువంటి స్టంట్ లను ఇతని చిత్రాల్లో ప్రత్యేకంగా స్లో మోషన్ లో చూపించటం జరుగుతుంది. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాలలో కూడా ఒక పాటని తన గాత్రంతో ఆలపించారు.పవన్ కళ్యాణ్ చిత్రాలలో కనీసం ఒక్క జానపద గీతమైనా ఉంటుంది. నేపథ్యగాయకులతో, కొన్ని మార్లు పవన్ కల్యాణే ఈ గీతాలను ఆలపించటం విశేషం.
-రాజకీయ జీవితం
2014 మార్చి 14న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపాడు. రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిందిస్తూ, కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశాడు. జనసేనపార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికాడు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేశాడు. ఇతని ప్రచారంతోనే టీడీపీ ఏపీలో అధికారంలోకి రాగలిగినది. కాంగ్రెస్ హటావ్- దేశ్ బచావ్ అన్న అతని నినాదాన్ని అందుకున్న అభిమానులు, ప్రజలు ఏపీలో ఒక్కసీటు కూడా కాంగ్రెసుకు దక్కనివ్వలేదు. రాజకీయవేత్తగా పవన్ నిలిచాడు. ఆచరణ పూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాడు. కానీ ఆతరువాత తన పార్టీని పటిష్టం చేసుకోకుండా తిరిగి సినిమాలలో నటించడం మొదలు పెట్టాడు. 2019 లో జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీని పోటీకి నిలిపాడు. తాను స్వయంగా భీమవరం, గాజువాకలలో రెండు చోట్ల పోటీ చేసాడు. ఈ ఎన్నికలలో తాను రెండు స్థానాల్లోనూ పరాజయం పాలవ్వగా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రం విజయం సాధించింది. తెలంగాణాలో నామ మాత్రంగానే పోటీకి దిగాడు. పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.
-పవన్ వ్యక్తిగత జీవితం..
మే 1997లో నందినితో పవన్ కు వివాహం జరిగింది. అయితే విభేదాలతో వీరిద్దరూ విడిపోయారు. 2008 ఆగస్టు 12లో విశాఖపట్నం లోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. రేణూ దేశాయ్ తో పవన్ సహ జీవనం చేసి పెళ్లి చేసుకున్నాడు.
నటిగా మారిన మోడల్ రేణూ దేశాయ్ ను 2009 జనవరి 28 న వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురొసావాపై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యాభర్తలుగా విడిపోయినా, తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణుక ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. 2013 సెప్టెంబరు 30న పవన్ వివాహం రష్యా నటి అన్నా లెజ్‌నేవాతో జరిగింది. హైదరాబాదు లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్.
Also Read: Pawan Kalyan Pooja Hegde Movie: పవన్ తో సినిమా పై పూజా హెగ్డే రియాక్షన్ ఇదే
ప్రస్తుతం మళ్లీ విజయాల బాట పట్టిన పవన్ కల్యాన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే రాజకీయంగాను యాక్టివ్ గా ఉంటున్నాడు.
Also Read: Pawan Kalyan: జనసేన బలోపేతానికి ఏం చేయాలి? ప్రజారాజ్యం నేతల వైపు పవన్ కల్యాణ్ చూపు?