
Pakija’s Re-entry : జబర్దస్త్ ఎందరి జీవితాల్లో మార్చేసింది. అనసూయ నుండి గెటప్ శీను వరకు ఆ షో వేదికగా అనేక మంది స్టార్స్ అవతరించారు. సుడిగాలి సుధీర్ అయితే ఏకంగా స్టార్ హీరో పొజిషన్ మీదే కన్నేశారు. అలాంటి జబర్దస్త్ ని నమ్ముకొని ఎంట్రీ ఇచ్చింది లేడీ కమెడియన్ వాసుకి. ఆమెను వాసుకి అని పరిచయం చేస్తే తెలుగువారు గుర్తించడం కష్టమే. టాలీవుడ్ ఆడియన్స్ కి వాసుకి పాకీజాగా పరిచయం. అసెంబ్లీ రౌడీ మూవీలో వాసుకీ పాకీజా అనే పాత్ర చేశారు. ఆ బ్లాక్ బస్టర్ మూవీలో బ్రహ్మానందం, పాకీజా కామెడీ ఎపిసోడ్ సూపర్ హిట్. తెలుగులో ఆమె చేసింది చాలా తక్కువ చిత్రాలు. పాకీజా పాత్ర మాత్రం ఆమె ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది.
అయితే వాసుకి సిల్వర్ స్క్రీన్ కి దూరమై చాలా కాలం అవుతుంది. అవకాశాలు రాకపోవడంతో చెన్నై నుండి మదురై దగ్గర్లో గల సొంతూరికి వెళ్ళిపోయింది. ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాసుకి దుర్భర పరిస్థితి వెలుగులోకి వచ్చింది. మంచి భోజనం చేసి ఆరు నెలలు అయ్యిందని ఆమె చెప్పిన మాటలు విని ప్రేక్షకులు గుండెలు ద్రవించి పోయాయి. ఆమెకు షుగర్ వ్యాధి సోకింది. వైద్యానికి కూడా డబ్బులు లేవని చెప్పారు.
కోలీవుడ్ పెద్దలకు తన గోడు వినిపించుకున్నా ఎవరు పట్టించుకోలేదని చెప్పింది. నడిగర్ సంఘం తనకు ఎలాంటి సహాయం చేయలేదని వాపోయారు. వాసుకి పేదరికం గురించి తెలుసుకుని చిరంజీవి ఆర్థిక సహాయం చేశారు. కొంతలో కొంత టాలీవుడ్ తనను ఆదుకుందని వాసుకి కృతఙ్ఞతలు తెలిపారు. కాగా ఆమె జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చారు. లేటెస్ట్ ఎపిసోడ్లో తళుక్కున మెరిశారు.
ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్లో వాసుకి స్కిట్ చేశారు. రైజింగ్ రాజు టీమ్ లో ఆమె నటించారు. ప్రోమో విడుదల కాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వాసుకి ఆర్థిక కష్టాలు తీరినట్లే అని కొందరు అభిప్రాయం వెల్లడిస్తున్నారు. చిన్నదైనా పెద్దదైనా అవకాశం వస్తే చాలు వాసుకి అనుకుంటున్నారు. తనను తాను పోషించుకునే మార్గం వెతుకుతున్నారు. జబర్దస్త్ లో ఆమె సెటిల్ అయితే ఆర్థిక ఇబ్బందులు తీరినట్లే. అయితే ఆమెకు కొంతకాలం ఆఫర్స్ ఇస్తారా? లేక ఈ ఒక్క ఎపిసోడ్ తోనే తీసేస్తారా? అనేది చూడాలి…