Padmabhushan Awards: కేంద్ర ప్రభుత్వం కాసేపటి క్రితమే పద్మ పురస్కారాలను అందించింది. నందమూరి అభిమానులు తమ అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ కి ఈ పురస్కారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూసారు. నేడు వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ, దేశంలోనే మూడవ అత్యున్నత పురస్కారం అయినటువంటి పద్మభూషణ్ ని ప్రకటించారు. 5 దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి, తండ్రి ఎన్టీఆర్ కి తగ్గ తనయుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు బాలయ్య. ఆయన పోషించని పాత్ర, చేయని జానర్ ఏదైనా మిగిలి ఉందా అంటే అనుమానమే. అంతే కాదు వరుసగా మూడు సార్లు శాసనసభకు ఎన్నిక అవ్వడమే కాకుండా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో గొప్ప సేవ కార్యక్రమాలు చేపట్టి కోట్లాది మంది తెలుగు వాళ్లకు ఆదర్శప్రాయుడు అయ్యాడు. అలాంటి ఆయనకు ఈ పురస్కారం చాలా ఆలస్యంగా లభించిందని అందరి అభిప్రాయం.
అదే విధంగా తమిళనాడు లో అత్యంత ప్రజాధారణ, కోట్లాది మంది అభిమాన గణం ఉన్న తల అజిత్ కి కూడా పద్మభూషణ్ అవార్డు ని ప్రకటించారు. కేవలం సినీ హీరోగా మాత్రమే కాకుండా, ఒక అద్భుతమైన రేసర్ గా ఆయన ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. రీసెంట్ గానే ఆయన దుబాయ్ లో జరిగిన కార్ రేసింగ్ లో మూడవ స్థానం లో గెలిచి మన భారత్ పరువు ని నిలబెట్టి సత్తా చాటారు. అంతే కాదు తమిళనాడు ఏరోనాటికల్ విద్యార్థులకు ఉచితంగా విద్య భోదన చేస్తూ ఎంతోమందిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు. అలాంటి వ్యక్తికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం అత్యంత ప్రశంసనీయం. అదే విధంగా ప్రముఖ నటులు అనంత్ నాగ్, శేఖర్ కపూర్ , శోభన వంటి వారికి కూడా పద్మభూషణ్ అవార్డులు వరించాయి. అదే విధంగా అర్జిత్ సింగ్, మాడుగుల నాగఫణి శర్మ , మందకృష్ణ మాదిగ వంటి వారికి పద్మశ్రీ పురస్కారం దక్కింది.
అయితే నందమూరి బాలకృష్ణ కి పద్మభూషణ్ అవార్డు రావడం పై మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎంతో హర్షం వ్యక్తం చేసింది. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ వంటి వారు ట్విట్టర్ ద్వారా బాలయ్య బాబు కి శుభాకాంక్షలు తెలియచేసారు. అంతే కాకుండా డైరెక్టర్ రాజమౌళి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఈసారి పద్మ అవార్డ్స్ ఏకంగా 7 మంది తెలుగు వాళ్లకు దక్కడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అందరికంటే ముందుగా బాలకృష్ణ కి శుభాకాంక్షలు తెలియచేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. చాలా కాలం నుండి వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అంటూ మీడియా లో ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో బాలయ్య బాబు కి ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.