Enna Vilai review: కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా సినిమాలు చూసే విధానంలో వారు తమ ధోరణి పూర్తిగా మార్చుకున్నారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు దర్శకులు కూడా కొత్త కొత్త కథలతో సినిమాలు రూపొందిస్తున్నారు. కొందరు దర్శకులు కోర్టు రూము డ్రామాల చుట్టూ కథలు అల్లుకొని ప్రేక్షకుల ఊహలకు అందకుండా సినిమాలు తీస్తున్నారు. అలాంటి సినిమాలు బ్రహ్మాండమైన విజయాలు సొంతం చేసుకుంటున్నాయి. ఆ కోవలోకే వస్తుంది ఎన్నా వీలై ( Enna Vilai Cinema Review). ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది.. ఎందులో చూడాలో ఈ రివ్యూ లో చూద్దాం..
నిజాయితీగా బతికే ఒక సామాన్యుడికి అన్యాయం ఎదురైతే
నిజాయితీగా బతికే ఒక సామాన్యుడికి అన్యాయం ఎదురైతే.. అన్యాయం నుంచి న్యాయం వెతుక్కోవడానికి అతడు ఎలాంటి పోరాటం చేశాడు.. ఆ పోరాటంలో ఎటువంటి అనుభవాలు అతనికి ఎదురయ్యాయి.. ఇందులో అతనికి అండగా ఎవరు నిలిచారు.. అతనిని ఎవరు ఇబ్బంది పెట్టారు.. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఈ అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కాకపోతే తమిళంలో.. ఈ సినిమాలో కరుణాస్.. నిమిషా సజయన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సజీవ్ పజూర్ దర్శకత్వం వహించారు. గత నెలలో ఈ సినిమా విడుదలైంది. ఇంట్రెస్టింగ్ స్టోరీ.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే.. న్యాయ వ్యవస్థలో అన్యాయమైన వ్యవహారాలను కూడా ఈ సినిమా ద్వారా దర్శకుడు బయటపెట్టాడు.
సినిమా కథ ఏంటంటే
రామేశ్వరంలోని సముద్రంలో భక్తులు చిల్లర నాణేలు విసిరేస్తూ ఉంటారు. వాటిని ఏరుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు తవాసిముత్తు. ఇతడు ఒక మత్స్యకారుడు. చిల్లర ద్వారా తన కుటుంబాన్ని సాకుతూ.. ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. ఒకరోజు అతడు చిల్లర కోసం సముద్రంలో డైవింగ్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అతనికి అత్యంత విలువైన బంగారు నగ దొరుకుతుంది.బంగారు నగను అతడు తన దగ్గర ఉంచుకోడు. పోలీసులకు అందజేస్తాడు. అయితే అతడి నిజాయితీ ఒక్కసారిగా ఇబ్బందిగా మారిపోతుంది. ఆభరణం దొరికిన తర్వాత పోలీసులకు ఇచ్చినప్పటికీ.. ఆ కేసులు అతడు అక్యూజ్డ్ గా మారిపోవాల్సి వస్తుంది. తాను ఎటువంటి అపరాధం చేయకపోయినప్పటికీ పోలీసులు ఎంక్వయిరీ చేస్తారు. కేసులు పెడతారు . తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అతడు ఇబ్బందులు పడతాడు. ఇలాంటి దుస్థితిలో న్యాయవాది కాంచన అతడి సమస్యను గుర్తించి.. అందులో నుంచి బయటపడేసేందుకు పోరాటం చేస్తుంది. మొత్తానికి తవాసికి న్యాయం జరుగుతుందా.. అతడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు.. అనేది మిగతా కథ..
కరుణాస్
హాస్య పాత్రలకు ఇతడు పెట్టింది పేరు. కానీ ఈ సినిమాలో చాలా తీవ్రమైన భావోద్వేగాలను పలికించే పాత్రలో కనిపించాడు. ఈ పాత్రలో అమాయకత్వం నిండుగా ఉంటుంది. కుటుంబం మీద ప్రేమ విపరీతంగా ఉంటుంది.
నిమిషా సజయన్
తవాసిముత్తు పాత్ర తర్వాత ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ నిమిషా. కోర్టు సన్నివేశాలలో ఈమె తన విశ్వరూపాన్ని చూపించింది. ఆత్మవిశ్వాసం.. బలమైన వ్యక్తిత్వం.. సమస్యలు ఎలాగైనా సరే ఎదుర్కొనే తీరు.. వంటి కోణాలలో ఈమె పాత్ర సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలలో ఈమె పలికిన సంభాషణలు ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టిస్తాయి.
సినిమా ప్లస్ పాయింట్స్..
- విభిన్నమైన కథ.. నిజాయితీగా వ్యవహరించిన వ్యక్తి అపరాధిగా మారిపోవడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది.
- చిత్ర కథానాయకుడు కరుణాస్ నటన.. అతడు పలికించిన భావోద్వేగాలు కన్నీరు పెట్టిస్తాయి.
- సామాన్యుడికి వ్యవస్థతో ఎదురయ్యే ఇబ్బందులను ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రశ్నిస్తాడు.
- ఇక ఆల్ఫీ అంటోని సినిమాటోగ్రఫీ రామేశ్వరం నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది.
- ఈ సినిమాకు సంబంధించిన కథకు తగ్గట్టుగా వాతావరణన్ని స్క్రీన్ నిండా ఆవిష్కరిస్తూ ఉంటుంది.
- దర్శకుడు సజీవు పజూర్ నార్మల్ పాయింట్ ను ఈ రేంజ్ లో తీయడం చప్పట్టు కొట్టిస్తుంది.
- అధికారం పక్కదారి పడితే.. రైట్స్ కోసం ఆర్డినరీ పీపుల్ స్ట్రగుల్స్ వంటి వాటిని ఈ సినిమాలో అత్యంత విస్తృతంగా చూపించారు.
- వాటిని అనేక రకాల అంశాలతో ముడిపెట్టారు.
- సామ్ సీఎస్ ఇచ్చిన మ్యూజిక్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్ కి అదనపు బలాన్ని ఇచ్చాయి.
- కోర్టు సన్నివేశాలు వస్తున్నప్పుడు సంగీతం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
మైనస్ పాయింట్లు
- కథ అద్భుతంగానే ఉన్నప్పటికీ.. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగిపోతూ ఉంటాయి.
- కోర్టు నేపథ్యంలో వచ్చే డ్రామా కొన్నిచోట్ల రిపీటెడ్ అనిపిస్తూ ఉంటుంది.
- కుటుంబంలో కొన్ని సందర్భాలలో భావోద్వేగాలు డ్రామా మాదిరిగా అనిపిస్తూ ఉంటాయి.
- వాటిని కనుక లోతుగా చూపించి ఉంటే సినిమా స్థాయి మరో విధంగా వెళ్ళేది.
- బలమైన మెసేజ్ ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లే లో ఆశించిన వేగం ఉండదు.
- దీనివల్ల కొన్ని సన్నివేశాలు ఎఫెక్ట్ ప్రేక్షకుల మీద అంతగా చూపించదు
ఈ సినిమా అక్టోబర్ 15న ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. చివరగా ఎన్నా వీలై అనే పదానికి ఎంత ఖరీదు అని అర్థం. ఖాకీలు పెట్టిన కేసుల వల్ల కథానాయకుడు తన విలువైన జీవితాన్ని ఖర్చు చేశాడని అర్థం.