Anveshippin Kandethum Review: దృశ్యం, ఫోరెన్సిక్, అంజం పతీరా, అయ్యప్పనం కోసియం, నాయట్టు, ఇరాట్టా, కన్నూరు స్క్వాడ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మలయాళ సినిమాలో ఓటిటిని దున్నేశాయి. ఇప్పుడు సేమ్ అదే మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన ఓ సినిమా ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది. మలయాళం లో నెల క్రితం థియేటర్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. తాజాగా ఈ సినిమా తెలుగు డబ్ తో ఓటీటీ లో విడుదలై ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..
సినిమా పేరు: అన్వేషిప్పన్ కండతుమ్
(Anveshippin kandethum)
కథాంశం: ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
రన్ టైం: రెండు గంటల 25 నిమిషాలు
రేటింగ్: U/A
తారాగణం: టోవినో థామస్, శ్రీదేవి, సిద్ధిఖీ, ఇంద్రాస్, తదితరులు.
దర్శకత్వం: డార్విన్ కురియా కోస్.
నిర్మాత: డోల్విన్ కురియా కోస్, జీను అబ్రహం, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ ఆనంద్ కుమార్.
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
Rating: 3/5
కోవిడ్ సమయంలో OTT ప్రజలకు బాగా చేరువైంది. ఆ సమయంలో OTT సంస్థలు మలయాళ సినిమాలను తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలకు కనెక్ట్ కావడం మొదలుపెట్టారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, అద్భుతమైన డ్రామా, ఉత్కంఠకు గురిచేసే పోలీస్ ఇన్వెస్టిగేషన్.. ఇలా రకరకాల ఎలిమెంట్లతో మలయాళ మూవీ మేకర్స్ సినిమాలు తీయడంతో తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అలాంటి మలయాళ సినిమాల ద్వారా టోవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన నటుడయ్యాడు. గత ఏడాది విడుదలైన 2018 సినిమా ద్వారా ప్రేక్షకులను మరింతగా మెప్పించాడు. అతడు హీరోగా నటించిన తాజా మలయాళ సినిమా “అన్వేషిప్పన్ కండతుమ్.’ గత నెలలో విడుదలైన ఈ సినిమా కేరళలో సంచలన విజయం సాధించింది.. తెలుగు డబ్ వెర్షన్ తో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
ఇదీ కథ
ఆనంద్ నారాయణన్(టోవినో థామస్) వృత్తిరీత్యా సబ్ ఇన్ స్పెక్టర్. అతడు కేరళలోని ఓ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంటాడు.. ఉన్నట్టుండి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అపహరణకు గురవుతుంది. దానికి సంబంధించిన కేసు పోలీస్ స్టేషన్లో నమోదవుతుంది. ఆ యువతి అపహరణ కేసును ఆనంద్ అతని బృందం చేదిస్తుంది. అయినప్పటికీ ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేస్తారు. కోర్టు ముందు నిందితులుగా నిలబడతారు. కొన్నాళ్లకు ఆనంద్, అతడి బృందానికి మళ్లీ పోస్టింగ్ దక్కుతుంది. ఈసారి వారికి శ్రీదేవి అనే యువతి కేసును డిపార్ట్మెంట్ అప్పగిస్తుంది. ఆ కేసును ఆనంద్ బృందం ఎలా చేదించింది? ఈ క్రమంలో వారికి ఎలాంటి సమస్య ఎదురయ్యాయి? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే
ముందుగానే చెప్పినట్టు ఈ సినిమాను దర్శకుడు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో రూపొందించాడు.. ముందుగా ఒక యువతి అపహరణ కేసును చేదించిన పోలీసులు.. తర్వాత మరొక కేసును ఎలా చేదించారు? అనేది వాస్తవ జీవితంలో జరిగినట్టుగా దర్శకుడు చూపించాడు. పోలీస్ నేపథ్యం ఉన్న సినిమాలంటే బీభత్సమైన పోరాటాలను ప్రేక్షకులు ఊహిస్తారు. కానీ అలాంటివేవీ ఈ సినిమాలో ఉండవు. నిజ జీవితంలో పోలీసులు దర్యాప్తు ఎలా చేస్తారో.. అలానే ఇందులోనూ దర్శకుడు చూపించాడు. అయితే రెండు కేసులను చేదించే క్రమంలో ప్రేక్షకులకు ఊహించని మలుపులను దర్శకుడు అందించాడు. అవే ఈ సినిమాను నిలబెట్టాయి. ముఖ్యంగా రెండు కేసులను పరిష్కరించే సమయంలో.. సినిమా చివర్లో దర్శకుడు చూపించిన మలుపు ఈ సినిమాకే హైలెట్.
పాత్రలు ఎలా ఉన్నాయి అంటే
ఆనంద్ పాత్రలో టోవినో థామస్ జీవించాడు. నిజ జీవితంలో పోలీసు లాగా కనిపించాడు. “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు” అనే సినిమాలో కథానాయకగా నటించిన అర్తన బిను ఇందులో కీలకపాత్ర పోషించింది. అందంగా కనిపిస్తూనే.. ఈ సినిమాను మలుపు తిప్పే పాత్రలో నటించింది. ఇక మిగతావారు తమ పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ విషయాలు
సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.
ప్లస్ లు
కథ, టోవినో థామస్ యాక్టింగ్, స్క్రీన్ ప్లే, చివర్లో వచ్చే ట్విస్టులు.
మైనస్ లు
సినిమా నెమ్మదిగా నడవడం, అక్కడక్కడ సాగతీత సన్నివేశాలు.
చివరిగా.. 2018 సినిమా తర్వాత.. టోవినో థామస్ ఖాతాలో మరో హిట్.