NTR and Neil : ఆర్ ఆర్ ఆర్ కోసం ఏకంగా నాలుగేళ్లు కేటాయించాడు ఎన్టీఆర్. అందుకు తగ్గ ఫలితం దక్కింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కి భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. హిందీలో కూడా కొంత మార్కెట్ ఏర్పడేలా చేసింది. అంతర్జాతీయ సినిమా వేదికల మీద ఎన్టీఆర్ మెరిశాడు. ఆర్ ఆర్ ఆర్ అనంతరం దేవర మూవీతో సోలోగా భారీ హిట్ సొంతం చేసుకున్నాడు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన దేవర వరల్డ్ వైడ్ రూ. 500 కోట్ల గ్రాస్ రాబట్టింది. హిందీలో దేవర ఓ మోస్తరు ఆదరణ దక్కించుకుంది. మిక్స్డ్ టాక్ తో కూడా రూ. 60 కోట్ల వరకు అందుకుంది.
ఆర్ ఆర్ ఆర్, దేవర చిత్రాల కొరకు ఎన్టీఆర్ దాదాపు ఆరేళ్ళ సమయం తీసుకున్నారు. ప్రస్తుతం జోరు పెంచాడు. వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ నటిస్తున్న రెండు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఒకటి వార్ 2 కాగా, మరొకటి ప్రశాంత్ నీల్ చిత్రం. మే 20 ఎన్టీఆర్ జన్మదినం నేపథ్యంలో ఈ రెండు చిత్రాల నుండి ఎలాంటి అప్డేట్స్ వస్తాయనే ఆసక్తి ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో నెలకొంది. వార్ 2లో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న హృతిక్ రోషన్ హింట్ ఇచ్చాడు.
Also Read : రామ్ చరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరంటే!
వార్ 2 టీజర్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకగా విడుదల కానుంది. సోషల్ మీడియా వేదికగా హృతిక్ రోషన్ పరోక్షంగా తెలియజేశాడు. ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ చిత్రం వార్ 2. ఇది సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ కాగా, ఎన్టీఆర్ యాక్షన్ ఓ రేంజ్ లో ఇరగదీశాడని సమాచారం. వార్ 2 టీజర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ అనడంలో సందేహం లేదు. మరోవైపు ప్రశాంత్ నీల్ మూవీ నుండి కూడా టీజర్ వస్తుంది అంటూ ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం టీజర్ విడుదల చేసే అవకాశం లేదని అంటున్నారు.
ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ నుండి ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేస్తున్నారట. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లి కొద్ది రోజులు మాత్రమే అవుతుంది. ఈ కారణంగా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నారనేది లేటెస్ట్ న్యూస్. ఇది ఒకింత ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరిచే అంశమే. కాగా రాజమౌళి నిర్మాతగా ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ తెరకెక్కనుందని ఇటీవల ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ పై కూడా ఓ స్పష్టత ఎన్టీఆర్ జన్మదినం వేళ రావొచ్చు.