NTR: ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్. ఆస్కార్ వేదికపై ఈ ఇద్దరు టాప్ హీరోలకు అరుదైన గౌరవం దక్కింది. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్-చరణ్ ఫర్మామ్ చేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ సొంతం చేసుకుంది. భారతీయ సినిమా చరిత్రలో ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ గెలవడం అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది. ఆస్కార్ వేడుక ఘనంగా ముగించిన ఎన్టీఆర్ నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అభిమానులు పెద్ద ఎత్తున చేరి నినాదాలు చేశారు.
అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆస్కార్ అందుకోవడం జీవితంలో ఎన్నడూ మరవని అనుభూతిగా అభివర్ణించారు. కీరవాణి, చంద్రబోస్ వేదికపైకి వెళ్లడం, ఆస్కార్ అందుకోవడం ఆస్వాదించాను. నా దేశం వలె ఆస్కార్ అవార్డు కూడా చాలా గొప్పగా ఉంది. ఈ విజయం ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులది. అభిమానులది. అందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఆస్కార్ లో పాల్గొనే అరుదైన గౌరవం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.
కాగా ఆస్కార్ గెలిచామని ప్రకటించిన వెంటనే భార్య లక్ష్మీ ప్రణతికి కాల్ చేసినట్లు ఎన్టీఆర్ తెలిపారు. తన ఆనందాన్ని మొదటగా అర్థాంగితో పంచుకున్నానని ఎన్టీఆర్ వెల్లడించారు. ఆ విధంగా భార్యపై తనకున్న ప్రేమను ఎన్టీఆర్ పరోక్షంగా తెలియజేశారు. కాగా ఎన్టీఆర్ మరో అరుదైన ఘనత అందుకున్నారు. ఆస్కార్ 2023 టాప్ మేల్ మెన్షన్ గా నిలిచారు. సోషల్ ఇండియాలో ఎన్టీఆర్ ని ట్యాగ్ చేస్తూ అధికంగా చర్చ నడిచిందని అకాడమీ తెలియజేసింది.
ఇక రెండో స్థానం రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ హీరోలు గ్లోబల్ స్టార్స్ అయ్యారనడానికి ఇదే నిదర్శనమని చెప్పొచ్చు. మరోవైపు ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీకి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న మూవీ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ మార్చిలో మొదలుకానున్నాయి. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమం జరగాల్సి ఉండగా తారకరత్న సంఘటనతో వాయిదా వేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా… నిరవధికంగా షూటింగ్ కొనసాగనుందని సమాచారం. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కుతుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.