తెలుగు సినిమాకి విలువ పెరుగుతున్న రోజులు అవి. కానీ, సినిమా వాళ్ళు అనగానే అప్పటి సమాజంలో తాగుతారు, తిరుగుతారు అనే చెడ్డ పేరుండేది. దాంతో సినిమా వాళ్లన్నా, నాటకాలవాళ్లన్నా పిల్లనే కాదు, అసలు విలువ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి టైంలో ఇండస్ట్రీకి వచ్చారు ఎన్టీఆర్, ఏఎన్నార్. ఇప్పటి తరానికి వారి కంటే ముందు కూడా సినిమా రంగం ఉందని కూడా తెలియదు.
అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే ముందు కూడా సినిమా రంగంలో గొప్ప నటీనటులు ఉన్నారు. కానీ, అప్పటి వారిలో చాలామంది నటీనటులు చెడు అలవాట్లకు బానిసలైన వాళ్లే ఎక్కువ. అందుకే సినిమా వాళ్ళ పై గౌరవం ఉండేది కాదు. ఆ తరువాత ఎన్టీఆర్, ఏఎన్నార్ క్రమశిక్షణ కారణంగా ఆ అభిప్రాయం క్రమక్రమంగా మారుతూ వచ్చింది. సినిమా వాళ్లల్లో కూడా కొంతమంది ఎంతో గొప్పగా సిస్టమేటిక్ గా ఉంటారని నమ్మకం కలిగింది.
కానీ ఎన్టీఆర్ ఏఎన్నార్ సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పుడున్న డామినేషన్ లో వీళ్ళను ముఖ్యంగా ఏఎన్నార్ ను అసలు లెక్కచేసేవారే కాదు, అప్పటి రచయిత దర్శకనిర్మాతలలో ఎక్కువుగా పండితులు ఉండేవారు. ఎంతో పాండిత్యం ఉన్నవారు ఉండేవారు. వాళ్ళు ఏం మాట్లాడినా సంస్కృతంలోనే మాట్లాడేవాళ్లట.
ఏఎన్నార్ కి తెలుగు కూడా సరిగ్గా రాదు. పైగా చదువు లేదు. పల్లెటూరి నుంచి ఎద్దులు తోలుకుని పోలెం సాగు చేసుకుని నాటకాలు వేసుకుంటూ ఇండస్ట్రీకి వచ్చాడు. అందుకే అప్పట్లో ఏఎన్నార్ కి బాష పట్ల కనీస పరిజ్ఞానం కూడా ఉండేది కాదు. అలాగే తెలిసిన భాషలో కూడా చక్కగా మాట్లాడటం కూడా చేతయ్యేది కాదు అట. అయితే ఎన్టీఆర్ బాగా చదువుకున్నారు.
పైగా ఆయన మాట తీరు బాగుండేది. కానీ, ఎన్టీఆర్ కి ఆవేశం ఎక్కువ. ఆ ఆవేశంలో ఆయన గంబీరంగా మాట్లాడేవాళ్ళు. దాంతో కొంతమంది ఎన్టీఆర్ ను అపార్ధం చేసుకునేవాళ్లు. మొత్తమ్మీద వీళ్ళిద్దరూ అప్పటి మహామహుల ధాటికి తట్టుకుని వీళ్ళ కాళ్ల మీద వీళ్ళు నిలబడటానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ క్రమంలో ఎంతో గొప్పగా ఎదిగారు. చివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి క్రమశిక్షణ నేర్పారు. ఒక గౌరవం తెచ్చారు.