ఇండస్ట్రీలో ఇప్పుడు కాంబినేషన్ ల గోల ఎక్కువైపోయింది. అందరూ కరోనా సెకెండ్ వేవ్ తో ఖాళీగా ఉండేసరికి కొత్త ఐడియాలు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా హీరోల కాంబినేషన్ సినిమాలే కాదు, ఇప్పుడు నిర్మాతల కాంబినేషన్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా రాబోతున్నాయి. పెద్ద పెద్ద నిర్మాతలు కలిసి ఓ సినిమానో లేక ఒక వెబ్ సిరీస్ నో తీయడం అనేది ఇప్పుడు ఒక కొత్త ఐడియాగా మారుతోంది.
నిజానికి దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డి కలిసి ఇప్పటికే పలు చిన్న చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే దర్శకుడు మారుతి, బన్నీ వాసు కలిసి మూడు వెబ్ సిరీస్ లను నిర్మించే పనిలో పడ్డారని తెలుస్తోంది. అలాగే యువి వంశీ, దిల్ రాజు కాంబినేషన్ లో కూడా త్వరలోనే కొన్ని చిన్న చిత్రాలు రానున్నాయి.
అదేవిధంగా హరీష్ శంకర్ – నిర్మాత కృష్ణ కలయికలో రెండు వెబ్ సిరీస్ లు రానున్నాయి. ఇక సురేష్ బాబు – రవిబాబు కాంబినేషన్ లో కూడా రెండు సినిమాలు రాబోతున్నాయి. మొత్తానికి నిర్మాతలతో చేరి దర్శకులు కూడా నిర్మాతలుగా మారి చిన్న, మీడియం సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా కొన్ని కలయికలో తమ తొలి సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్.
మరీ ఈ కాంబినేషన్స్ ఎంతవరకూ గిట్టుబాటు అవుతాయో చూడాలి. ఎలాగూ ఓటీటీలలో డిమాండ్ ఉంటుంది కాబట్టి మేకర్స్ కూడా కంటెంట్ పై ఆసక్తి చూపిస్తున్నారు.