సినిమా బాగా వచ్చిందని.. హిట్ అవుతుందని.. ప్రేక్షకులే హిట్ చేయించాలని హీరోలు సాధారణంగా చెబుతుంటారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తారు. కానీ యంగ్ ఫైర్ బ్రాండ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అంతకుమించి మాట్లాడాడు.
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘పాగల్’ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా నిన్న రాత్రి ప్రీరిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్ రెచ్చిపోయాడు. ‘సర్కస్ లో సింహంతో ఎవడైనా ఆడుకుంటాడు. నేను అడివికి వచ్చి ఆడుకునే టైపు.. మూసుకున్న థియేటర్లు తెరిపిస్తా’ అని విశ్వక్ సేన్ తన సినిమా గురించి గొప్పలకు పోయాడు. అంతేకాదు.. ‘అమ్మా తోడు సినిమా మామూలుగా ఉండదు.. హిట్ కొడుతున్నాం.. ఈ సినిమా హిట్ కాకపోతే నేను నా పేరు మార్చుకుంటా రాసుకోండి’ అంటూ సవాల్ చేశాడు విశ్వక్ సేన్.
ఇప్పటికే ఇండస్ట్రీలో విశ్వక్ సేన్ కు నోటి దురుసు ఎక్కువ అని ఓ టాక్ ఉంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి అప్పట్లో విశ్వక్ సేన్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఇప్పుడు కూడా ప్రిరీలీజ్ వేడుకలో కాస్త అతిగా విశ్వక్ సేన్ మాట్లాడాడని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
కరోనా లాక్ డౌన్ తో సినిమా థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు తడబడుతున్నారు. ఏకంగా నా సినిమాతో థియేటర్లలోకి రప్పిస్తానని విశ్వక్ సేన్ తొడగొట్టడంపై నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. సింహాలు, పులులు అంటావా? అని ట్రోల్స్ చేస్తున్నారు. వకీల్ సాబ్, తిమ్మరుసు లాంటి పెద్ద చిత్రాలే లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతుంటే ‘పాగల్ ’ అంటూ వస్తున్న విశ్వక్ తో ఇది సాధ్యమా అని నెటిజన్లు కామెంట్లు, ట్రోల్స్ తో హోరెత్తిస్తున్నారు.