National Awards 2024: కోట్లాది మంది సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నేషనల్ అవార్డ్స్ 2024 జాబితా కాసేపటి క్రితమే విడుదలైంది. అయితే కచ్చితంగా మన టాలీవుడ్ నుండి మరోసారి ‘పుష్ప 2’ చిత్రానికి గానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా రెండవసారి నేషనల్ అవార్డుని అందుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఆయన అభిమానులకు నిరాశే మిగిలింది. ఉత్తమ నటులుగా ‘చందు ఛాంపియన్’ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్, ‘భ్రమ యుగం’ చిత్రానికి గాను మమ్ముట్టి నిలిచారు. అదే విధంగా ఉత్తమ చిత్రం గా ‘ఆర్టికల్ 370’ నిల్చింది. ‘ధురంధర్’ ఫేమ్ ఆదిత్య డర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘పుష్ప 2’ చిత్రానికి కూడా ప్రత్యేకంగా రెండు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు ని ఈ చిత్రానికి పనిచేసిన దీపాలీ నూర్ , సీతల్ శర్మలకు దక్కింది.
అదే విధంగా బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ క్యాటగిరీ లో సుకుమార్ కి అవార్డు దక్కడం గమనార్హం. అదే విధంగా ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి ‘బెస్ట్ స్క్రీన్ ప్లే’ అవార్డు సొంతం అయ్యింది. ఇక నాగబాబు కూతురు నిర్మాతగా పరిచయమైనా ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రానికి ఉత్తమ తెలుగు సినిమాగా నిల్చింది. 2024 లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా , సర్ప్రైజ్ హిట్ గా నిల్చింది. ఈ చిత్రం తో పాటుగా ధనుష్ నటించిన ‘రాయన్’, బెస్ట్ మలయాళీ మూవీ గా ‘ఫెమించి ఫాతిమా’, బెస్ట్ కన్నడ చిత్రంగా ‘మిధ్యా’, బెస్ట్ హిందీ సినిమాగా ‘శ్రీకాంత్’ అవార్డులను కైవసం చేసుకున్నాయి. ఇక మిగిలిన సినిమాల విషయానికి ఉత్తమ చిల్డ్రన్స్ మూవీ గా ’35 -చిన్న కథ కాదు’ , బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా అరుణ్ దేవ్ పోతుల (35-చిన్న కథ కాదు) అందుకున్నారు.
అదే విధంగా ఉత్తమ సహాయ నటిగా రూపశ్రీ వర్కాదీ (మిధ్యా) ఎంపిక కాగా, బెస్ట్ లిరిక్స్ క్యాటగిరీ లో మనోజ్ ముంతాషీర్ లు అవార్డులు కైవసం చేసుకున్నారు. ఇక బెస్ట్ కొరియోగ్రాఫర్ గా స్త్రీ 2 చిత్రానికి గానూ విజయ్ గంగూలీ అవార్డు ని కైవసం చేసుకోగా, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ క్యాటగిరీలో అనల్ అరసు ‘మహారాజ’ చిత్రానికి గాను అవార్డుని కైవసం చేసుకున్నారు. ఏది ఏమైనా మన టాలీవుడ్ మాత్రం ఈసారి కూడా నేషనల్ అవార్డ్స్ లో బలమైన ముద్ర వేసింది. ఇక మెగా ఫ్యామిలీ లో అల్లు అర్జున్ తర్వాత నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్న ఘనత నిహారిక కొణిదెల కి దక్కడం గమనార్హం.
