Kannamba Biography: టాకీలు మొదలైన రోజులు అవి. తెలుగు తెరకు నటీమణుల కొరత ఉండేది. అప్పుడే వచ్చారు నటశిరోమణి ‘పసుపులేటి కన్నాంబ’గారు. 1935 నుంచి 1964 వరకు చలనచిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన అద్భుత నటీమణి ఆమె. కానీ, అందాల నటి కాంచనమాల సౌందర్యం, కన్నాంబకు గట్టి పోటీని ఇచ్చింది. ఐతే, కాంచనమాల కేవలం పది సినిమాల్లో మాత్రమే తన తళుకులు చూపించగా.. కన్నాంబ మాత్రం ఏకంగా 170 చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో సినీరంగంలోనే కన్నాంబ అత్యంత ధనవంతురాలని ఆమెకు గొప్ప పేరు ఉంది. ఆ పేరుకి తగ్గట్టుగానే ఏడువారాల నగలతో ఎప్పుడు నిండుగా కనిపించేవారు. ఆమె ఇంట్లో ఎక్కడ చూసినా బంగారపు పాత్రలే కనిపించేవి.
నిజానికి సినీ రంగంలో మొట్టమొదటి వైభోగాన్ని చూసిన మొదటి నటి ‘కన్నాంబ’నే. దీనికి తోడు నిలువెత్తు విగ్రహం.., అద్భుతమైన, విస్పష్టమైన వాచకం, ఆశ్చర్యపరిచే నటనా పటిమ ఆమె సొంతం. ఇక కరుణరసం ఉట్టిపడే పాత్రల్లో అయితే.. అలరారిన నటీమణిగా కన్నాంబకి తిరుగులేని రికార్డు ఉంది. అలాగే వీరరసం ఉప్పొంగే పాత్రల్లో కూడా కన్నాంబ నటన వర్ణనాతీతం. అందుకే, తెలుగు చిత్రసీమతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఆమెను ఎంతగానో ఆదరించారు. పైగా కన్నాంబ నటి మాత్రమే కాదు, నిర్మాత కూడా. అలాగే మహా గాయని కూడా. మరి ఆ నటశిరోమణిని స్మరించుకుంటూ.. ఆమె గురించి నేటి తరానికి తెలియజేయాలనే మా ఈ ప్రయత్నం.
కన్నాంబ బాల్యం :
వెంకట నరసయ్య – లోకాంబ దంపతులకు 1911వ ఏడాది అక్టోబర్ 5వ తేదీన కన్నాంబ కడప పట్టణంలో జన్మించారు. ఆమె తండ్రి వెంకట నరసయ్య ప్రభుత్వ కాంట్రాక్టర్ గా పని చేసేవారు. నరసయ్య – లోకాంబ జంటకు కన్నాంబ ఒక్కటే సంతానం. అయినా, కన్నాంబ మాత్రం వాళ్ల అమ్మమ్మ గారింట ఏలూరులోనే పెరిగి పెద్దయ్యారు. కన్నాంబగారికి ఆమె తాతయ్య నాదముని నాయుడు అంటే ఎంతో అభిమానం. నాదముని నాయుడు వైద్యవృత్తిలో వుండేవారు. బాగా చదువుకున్న వ్యక్తి. కన్నాంబ ఇష్టాన్ని అభిరుచిని గమనించి ఆమెను ఆ దిశగా ప్రోత్సహించిన ఆదర్శవాది. కన్నాంబకు సంగీతం లో శిక్షణ ఇప్పించారు. ఆ అనుభవంతోనే తన 13వ ఏటనే కన్నాంబ నాటకాల్లో నటించడం మొదలు పెట్టారు.
నాటకాల్లో కన్నాంబ గొప్పతనం :
దాదాపు వందేళ్ల క్రితం ఒక ఆడపిల్ల తన పదహారు సంవత్సరాల వయసులో నాటకాల్లో నటించడం అంటే.. అది అతి పెద్ద సాహసం. అయినా, ఆమె గొప్ప తనానికి ఇది ఒక ఉదాహరణ. ఏలూరు పట్టణంలో సత్య హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ నాటకానికి కన్నాంబ గారు కూడా తన తాతయ్య గారితో వెళ్లింది. నాటకం మొదలైంది. జనం గోల చేస్తున్నారు. కారణం.. చంద్రమతి పాత్రధారి శోక రసంతో పాడాల్సిన పద్యాలను సరిగ్గా పాడలేకపోతున్నారు. ప్రేక్షకులు గోల నుంచి గేలి చేయడం ప్రారంభించారు. ఆ హేళనలు కేకలతో స్టేజ్ దద్దరిలిపోతుండగా.. ప్రేక్షకుల మధ్య నుంచి ఒక అమ్మాయి లేచి రంగస్థలం మీదకు వెళ్లి చంద్రమతి పాత్రను తాను పోషిస్తానని అని సగర్వంగా ప్రకటించింది. ఆమె గొంతులో ఒక రాజసం కనిపించింది. స్టేజ్ ముందు కూర్చున్న జనం అంతా నోరెళ్ళ బెట్టి చూస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి వేగంగా ముఖానికి రంగు పూసుకొని వచ్చి పద్యాలు పాడటం మొదలుపెట్టింది. ఎవరామె ? ఎవరు ఈ అమ్మాయి ? ఎవరో కన్నాంబ అటయ్యా.’ ఇలా జనం గుసగుసలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మరోపక్క ప్రేక్షకులు అంతా నిశ్చేష్టులై చూస్తూ వన్స్ మోర్ అంటూ ఈలలు కొట్టడం ప్రారంభించారు. ఇంత ఘనంగా కన్నాంబ నాటక ప్రస్థానం మొదలైంది.
కన్నాంబ సినీ రంగ ప్రవేశం :
అది 1935వ సంవత్సరం. సామాన్య జనానికి సినిమా అంటే ఏమిటో తెలియని రోజులు అవి. దర్శక నిర్మాత పి.పుల్లయ్య మరికొందరు మిత్రులతో కలిసి ఒక సినిమా నిర్మాణానికి నడుం బిగించారు. ఆ సినిమా పేరు ‘హరిశ్చంద్ర’. అద్దంకి శ్రీరామమూర్తి ని హరిశ్చంద్రుడు పాత్ర కోసం తీసుకున్నారు. మరి, చంద్రమతి పాత్రలో ఎవర్ని తీసుకోవాలి ? ఎందర్నో చూశారు. కానీ.. పి.పుల్లయ్యగారికి ఎవరూ నచ్చలేదు. ఆ సమయంలోనే బళ్లారిలో హరిశ్చంద్ర నాటకానికి వెళ్లారు. చంద్రమతిగా నటించిన కన్నాంబ నటనను చూసి ఆయన సంబరపడిపోయారు. తన సినిమాలో నటించమని ఆమెను ఆహ్వానించారు. అలా కన్నాంబ సినీ రంగ ప్రవేశం జరిగింది.
Also Read: F3 As Same As F2: ప్చ్.. ‘ఎఫ్ 3’లోనూ ‘ఎఫ్ 2’ వాసనలే !
కన్నాంబ ప్రేమ వివాహం :
బందరు ‘బాలమిత్ర నాటక సమాజం’లో పనిచేస్తున్న రోజుల్లో కన్నాంబ గారికి కడారు నాగభూషణం గారు పరిచయం అయ్యారు. కన్నాంబ ప్రదర్శించే నాటకాలకు ఆయన ప్రయోక్తగా వ్యవహరించేవారు. ఆ సమయంలో వీరి మధ్య కలిగిన పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రణయం కారణంగా ఇద్దరూ దంపతులయ్యారు. ఐతే, నాగభూషణంకి అప్పటికే పెళ్లి అయ్యింది. అందుకే, తన వివాహ వార్తను 1941 వరకు కన్నాంబ అధికారికంగా ప్రకటించలేకపోయింది. ఎందరి చేతో అమ్మ అని పిలిపించుకున్న ఆమె కూడా తన దాంపత్య జీవితంలో పొరపాటు చేసింది. ఐతే.. ఆమె వైవాహిక జీవితం కడదాకా సాఫీగానే సాగిపోయింది.
నిర్మాతగా కన్నాంబ ప్రయాణం :
తన భర్త కడారు నాగభూషణానికి మేలు చేయాలనే ఉద్దేశ్యంతో కన్నాంబ ‘శ్రీరాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ’ని స్థాపించారు. 1941లో తొలి సినిమా ‘తల్లిప్రేమ’ అనే చిత్రాన్ని ఆమె నిర్మించారు. సినిమా విజయవంతమైంది. ఆ విజయమే ఆమెకు శాపం అయ్యింది. సినీ నిర్మాణం పై ఆమెకు చులకన భావం ఏర్పడింది. తన భర్త కడారు నాగభూషణం స్వీయ దర్శకత్వంలో ‘సతీసుమతి’ అనే చిత్రం నిర్మించింది. నష్టాలు వచ్చాయి. దాంతో కన్నాంబ అనారోగ్యం పాలయ్యారు. రెండేళ్లు పాటు సినిమాలకు ఆమె దూరం జరగాల్సి వచ్చింది.
పడిలేచిన కెరటం కన్నాంబ :
నష్టాలతో సినీ నిర్మాణం చేయలేక పారిపోయిన నిర్మాతలు ఉన్న రోజులు అవి. అయినా, కన్నాంబ గారు మాత్రం ధైర్యంగా నిలబడి పోరాడారు. తన సినీ నిర్మాణానికి డబ్బులు లేక, బయట సంస్థలు నిర్మించిన అనేక సినిమాల్లో మళ్లీ నటించడం మొదలు పెట్టారు. ‘మాయాలోకం’, ‘మాయా మశ్చీంద్ర’, ‘పాదుకా పట్టాభిషేకం’ అనే మూడు చిత్రాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కన్నాంబ ప్రభ మళ్లీ కొన్నాళ్ళు వెలిగింది. మళ్లీ సినీ నిర్మాణం వైపు వెళ్లారు. వరుసగా ‘హరిశ్చంద్ర’, ‘తులసీజలంధర’, ‘సౌదామిని’, ‘పేదరైతు’, ‘లక్ష్మి’, ‘సతీ సక్కుబాయి’, ‘దక్షయజ్ఞం’ వంటి సినిమాలు సొంతంగానే నిర్మించి మంచి పేరు సంపాదించారు.
మళ్లీ ఆర్థిక కష్టాలతో కన్నాంబ ఇబ్బందులు :
తన భర్త నాగభూషణం దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంతో కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆమెకు మళ్లీ ఆర్థిక కష్టాలు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా 1951 తర్వాత కన్నాంబ నిర్మించిన సినిమాలు వరుసగా పరాజయం పాలవుతూ వచ్చాయి. పైగా, తన సినిమా నిర్మాణంలో కష్టనష్టాలు వచ్చినా.. కన్నాంబ గారు కళాకారులకు, సాంకేతిక సిబ్బందికి ఎంతో నిబద్ధతతో జీతాలు ముందే ఇచ్చేసేవారు. పైగా ఆ రోజుల్లో కన్నాంబ కంపెనీలో భోజనం చెయ్యని కళాకారుడు లేడు. కన్నాంబ దాతృత్వం అలాంటిది మరి. భోజనం పెట్టి, ఆదరించడంలో ఆమె మహా సాధ్వీమణి. ఇది కూడా కన్నాంబ ఆర్థిక ఇబ్బందులకు ఒక కారణం.
కన్నాంబ కన్నుమూత :
కన్నాంబగారు తన సొంత బ్యానర్ పై దాదాపు 30 చిత్రాలు నిర్మించారు. ఆ రోజుల్లోనే రెండు భాషల్లో ‘దక్షయజ్ఞం’ చిత్రాన్ని నిర్మించి భారీగా నష్టపోయారు. ఆమె చివరి రోజుల్లో పెద్దగా కష్టాలు పడకపోయినా.. కొన్ని అవమానాలు మాత్రం పడ్డారు. ఇక కన్నాంబ గారు 7మే 1964న 52 ఏళ్ల పిన్న వయసులోనే కన్నుమూశారు. చెన్నైలో జరిగిన ఆమె అంతిమయాత్రకు ఎన్టీఆర్, ఎమ్జీఆర్ లతో సహా మహా మహా నటీనటులు అందరూ హాజరై కన్నీళ్లతో అంజలి ఘటించడం ఒక్క కన్నాంబ గారికి మాత్రమే దక్కిన గౌరవం. అయితే కన్నాంబ గారి భర్త కడారు నాగభూషణం గారు మాత్రం అతి దయనీయమైన స్థితిలో 1976లో ఒక చిన్న హోటల్ గదిలో చనిపోవడం బాధాకరమైన విషయం.
Also Read: Rashmika Mandana: రష్మిక పై ఆ సీన్స్ తీస్తారట.. రణబీర్ కూడా రెడీ !