Malli Pelli OTT: నటుడు నరేష్ లేటెస్ట్ మూవీ మళ్ళీ పెళ్లి. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుండగా, బ్రేకులు పడ్డాయి. మూడో భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించడంతో నోటీసులు జారీ చేశారు. పవిత్ర లోకేష్-నరేశ్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి ఇటీవల విడుదలైంది. వివాదాల సమాహారంగా తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు ముందు సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. ట్రైలర్, టీజర్స్ సినిమా మీద ఆసక్తి పెంచాయి. దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించగా నరేష్ నిర్మించారు. భారీ హైప్ మధ్య విడుదలైన మళ్ళీ పెళ్లి చిత్రానికి ఆదరణ దక్కలేదు.
మళ్ళీ పెళ్లి విడుదలై నెల కావస్తుండగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. జూన్ 24 స్ట్రీమింగ్ డేట్ గా ప్రకటించారు. అయితే మళ్ళీ పెళ్లి స్ట్రీమింగ్ నిలిపివేయాలని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. సృజనాత్మకత, భావప్రకటనా స్వేచ్ఛ పేరిట తన గౌరవానికి భంగం కలిగిస్తున్నారని రమ్య రఘుపతి పేర్కొన్నారు. సినిమాలో కంటెంట్ తనపై అబద్దాలు ప్రచారం చేసేదిగా ఉంది. ఓటీటీ అత్యంత ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో మళ్ళీ పెళ్లి చిత్రం వలన తన పరువుకు నష్టం కలుగుతుంది, క్యారెక్టర్ ని తప్పుగా జనాలు అర్థం చేసుకుంటారని ఆమె విన్నవించారు.
దీంతో మళ్ళీ పెళ్లి స్ట్రీమింగ్ నిలిపివేయాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అమెజాన్ ప్రైమ్ మళ్ళీ పెళ్లి విడుదలకు బ్రేక్ ఇచ్చింది. ఆహా మాత్రం ఇంకా అందుబాటులో ఉంచింది. వారు కూడా మళ్ళీ పెళ్లి తొలగించే అవకాశం కలదు. కాగా మళ్ళీ పెళ్లి మూవీ నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి నిజ జీవితం ఆధారంగా రూపొందించారు. ఇటీవల కాలంలో ఈ ముగ్గురు కేంద్రంగా చోటు చేసుకున్న వివాదాలు, సంఘటనలు ప్రోమోలలో కూడా చూపించారు.
అసలు థియేట్రికల్ విడుదలను కూడా అడ్డుకోవాలని రమ్య రఘుపతి ప్రయత్నం చేసింది. అది కుదర్లేదు. ఓటీటీలో మాత్రం ఆమె ప్రయత్నం ఫలించిన సూచనలు కనిపిస్తున్నాయి. మళ్ళీ పెళ్లి చిత్రంలో నరేష్ మూడో భార్య పాత్రను వనిత విజయ్ కుమార్ చేసింది. ఆమెను తాగుబోతు, తిరుగుబోతు, డబ్బు పిచ్చి కలిగిన మహిళగా చూపించారు.