Saripodhaa Sanivaram : నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో మరో సంచలన విజయాన్ని నమోదు చేసిన సినిమా’సరిపోదా శనివారం. ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రూ100 కోట్ల క్లబ్‌లో చేరి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ యాక్షన్ డ్రామా, ఫిబ్రవరి 14న జపాన్‌లో ‘Suryas Saturday’ పేరుతో థియేటర్లలో విడుదల కానుంది.
నాని – ఎస్.జె. సూర్య మ్యాజిక్
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది నాని, ఎస్.జె. సూర్యల మధ్య యాక్షన్ సీన్లు. వారి మధ్య ఎదురుపడిన సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మ్యాజిక్‌ను రీమేక్‌లో రీ-క్రియేట్ చేయలేమని భావించి, హిందీలో కార్తీక్ ఆర్యన్‌తో రీమేక్ చేసే ఆలోచనను నిర్మాతలు మానేశారు. అయితే, ఈ సినిమా Netflix లో అందుబాటులో ఉండటంతో, ఇప్పటికే అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఆస్వాదించారు.
జపాన్‌లో ఇండియన్ సినిమాలకు ఆదరణ ఎలా ఉంది?
జపాన్‌లో గతంలో చాలా భారతీయ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే భారీ విజయాన్ని అందుకున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన RRR సినిమా జపాన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. అంతకు ముందు బాహుబలి 2 కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ముత్తు, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, ఇంగ్లీష్ వింగ్లిష్, 3 ఇడియట్స్, లంచ్ బాక్స్ వంటి సినిమాలు జపాన్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి
ఫ్లాప్ అయిన సినిమాలు
ప్రభాస్ , అమితాబ్ ప్రధాన పాత్రలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 2898 ఏ.డి. సినిమాకు జపాన్ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. భారీగా ప్రమోషన్లు చేసినప్పటికీ, సినిమా అక్కడ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. జపాన్ ప్రేక్షకులు యూనిక్ స్టోరీలతో పాటు ఎమోషనల్ కంటెంట్ ఉండే సినిమాలను ఎక్కువగా ఆదరిస్తారు. ఈ నేపథ్యంలో ‘సరిపోదా శనివారం’ లో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నా, వాటిని జపనీస్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.
జపాన్‌లో హిట్ అయితే నానికి బంపర్ ఆఫర్స్!
ఈ సినిమా జపాన్‌లో విజయవంతమైతే, ‘హాయ్ నాన్న, దసరా’ వంటి నాని ఇతర హిట్ సినిమాలను కూడా అక్కడ విడుదల చేసే అవకాశముంది. ఇటీవల జపాన్‌లో జరిగిన ‘టెరుకోర్’ ఈవెంట్‌లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీని ద్వారా నాని జపాన్ మార్కెట్లో కూడా తన స్థాయిని పెంచుకునే అవకాశం ఉంది. ఇంతటి అంచనాల మధ్య ‘సరిపోదా శనివారం’ జపాన్ బాక్సాఫీస్‌ను ఎలా ఆకర్షిస్తుందో చూడాలి.