Nandamuri Heroes: టాలీవుడ్ లో కొన్ని కుటుంబాలకు చెందిన వ్యక్తులు రెండు, మూడు తరాలుగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఇలా చెప్పుకోవచ్చు. వీరిలో ముఖ్యంగా నందమూరి హీరోల గురించి తీసుకుంటే.. అప్పటి హీరో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణలు హీరోలుగా రాణించారు. ఓ వైపు వాళ్లు నటిస్తూనే తమ కుమారులను కూడా నటులుగా ప్రేక్షకులకు పరిచయం చేశారు.
సాధారణంగానే నందమూరి హీరోలకు ప్రజల్లో ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. మాస్ సినిమాలన్న, రాయలసీమ ఫ్యాక్షనిజం అయినా రౌడీయిజం అయినా నందమూరి హీరోల తర్వాతే ఎవరైనా అనే రీతిలో వారి సినిమాలు ఉంటాయి.అయితే వారికి క్లాస్ మూవీస్ అంత కలిసి రావనే చెప్పొచ్చు. నందమూరి హీరోలు చేసిన మాస్ సినిమాలకే ప్రేక్షకుల ఆదరణ ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ముందుగా నటసింహం బిరుదును సొంతం చేసుకున్న నందమూరి బాలకృష్ణని తీసుకుంటే ఆయన పేరు వింటే చాలు మాస్ సినిమానే గుర్తుకు వస్తుంది. నరసింహానాయుడు, చెన్నకేశవ రెడ్డి, సింహా, రూలర్, సమరసింహా రెడ్డి ఇలా ప్రతి మూవీతో మాస్ ప్రేక్షకులను విపరీతంగా సంపాదించుకున్నారు. మిత్రుడు, ముద్దుల మొగుడు వంటి క్లాస్ చిత్రాల్లోనూ బాలయ్య నటించారు. ఈ మూవీస్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ఇటీవల డబుల్ రోల్ చేసిన అఖండ సినిమా అఖండ విజయాన్ని సాధించి పెట్టింది. తరువాత ఈ సంక్రాంతికి విడుదలైన మరో మాస్ చిత్రం ‘వీరసింహారెడ్డి’ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. బాలయ్య డబుల్ రోల్ పోషించిన ఈ సినిమా రికార్డులను తిరగరాస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది.
జూనియర్ ఎన్టీఆర్.. నిన్ను చూడాలని సినిమాతో అరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనువడనిపించుకున్నారు. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సాంబ, సింహాద్రి, అశోక్ వంటి సినిమాలతో ఎన్నో హిట్ లను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నటించిన క్లాస్ మూవీలు నా అల్లుడు, ఊసరవెల్లి చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన మరో క్లాస్ మూవీ నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ హిట్ అందుకున్నా బ్లాక్ బాస్టర్ గా మాత్రం నిలవలేదని చెప్పొచ్చు. ఇటీవల వచ్చిన త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్ సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
కల్యాణ్ రామ్.. చిన్నతనం నుంచే సినిమాల్లో అడుగుపెట్టిన కల్యాణ్ రామ్ హీరోగా పలు హిట్ మూవీలు చేసి అభిమానులను సొంతం చేసుకున్నారు. లక్ష్మీకల్యాణం సినిమాతో హీరోగా ప్రస్థానం మొదలు పెట్టిన కల్యాణ్ రామ్ జయీభవ, అభిమన్యు, అతనొక్కడే, అసాధ్యుడు, విజయదశమి వంటి మూవీస్ లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆ తర్వాత డిఫరెంట్ కథనాలను ఎంచుకుంటూ చిత్రాలు చేస్తున్న ఆయన తాజాగా బింబిసారతో ఘన విజయాన్ని సాధించారు. ఇటీవల సరికొత్త కథనంతో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం అమిగోస్ లో కల్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ పోషించారు. అయితే కథా కథనం బాగున్నప్పటికీ భారీ అంచనాల నడుమ విడుదలైన అభిమానులు అనుకున్న అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది.
క్లాస్ మూవీస్ కంటే మాస్ సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు నందమూరి హీరోలు. దీంతో ప్రేక్షకులు, అభిమానులు కూడా తమ అభిమాన హీరోలు మాస్ చిత్రాలనే తీయాలని కోరుకుంటున్నారట. అయితే ఈ వ్యాఖ్యలను నందమూరి హీరోలు ఏ విధంగా తీసుకుంటారో వేచి చూడాల్సిందే.