
Nandamuri HariKrishna: ఎన్టీఆర్ (Senior NTR) కు ఏడుగురు కుమారులు ఉన్నారు. వారిలో నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) మూడోవాడు. అయితే.. తానే పెద్ద కుమారుడు అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లోకి తనదైన ముద్రవేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. గొప్ప కుమారుడిగా, గొప్ప తండ్రిగా, అంతకుమించి మనసున్న మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు. ఇవాళ హరికృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఆయన మైలురాళ్లను పరిశీలిద్దాం..
తెలుగు సినీ పరిశ్రమలో వారసత్వంతో ప్రవేశించిన తొలి నటుడు హరికృష్ణే. ఆయనలో ఉన్న స్పీడును గ్రహించిన ఎన్టీఆర్.. బాల్యంలోనే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 11 సంవత్సరాల వయసులో ‘శ్రీకృష్ణావతారం’ అనే చిత్రంలో చిన్ని కృష్ణుడిగా నటించి అలరించాడు, ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తల్లా పెళ్లామా?’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలోనూ కృష్ణుడి వేశం వేయడం విశేషం. ఆ తర్వాత ‘తాతమ్మ కల’, రామ్ రహీమ్ చిత్రాల్లో సోదరుడు బాలకృష్ణతో కలిసి నటించాడు. ఎవర్ గ్రీన్ చిత్రం ‘దాన వీర శూర కర్ణ’లో అర్జునుడిగా కనిపించారు. అయితే.. హీరోగా మాత్రం ఎదగలేకపోయారు.
అనంతరం చిత్ర నిర్మాణ రంగంలో కాలుమోపారు. ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు చిత్రంతో నిర్మాతగా మారారు రామకృష్ణ సినీ స్టూడియోస్, తారకరామ ఫిలిమ్స్ నిర్వహణను చూసుకున్నారు. సోదరుడు బాలయ్యతో అనసూయమ్మగారి అల్లుడు, పట్టాభిషేకం, పెద్దన్నయ్య వంటి చిత్రాలను నిర్మించారు. అయితే.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సినీరంగానికి పూర్తిగా విరామం ఇచ్చారు. చైతన్య రథసారథిగా రాష్ట్రం మొత్తం తిరిగారు. తండ్రికి అండగా ఉన్నారు. ఎన్టీఆర్ చనిపోయే వరకూ తండ్రితోనే ఉన్నారు హరికృష్ణ.
తెలుగుదేశం పార్టీని చంద్రబాబు టేకోవర్ చేయడం.. తండ్రి మరణంతో.. బాబును విభేదించి ‘అన్న తెలుగుదేశం’ అనే పార్టీని కూడా పెట్టారు. అయితే.. విజయం సాధించలేకపోయారు. 1996లో తండ్రి ప్రాతినిథ్యం వహించిన హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగానూ పనిచేశారు. ఈ విధంగా.. చాలా కాలం నటనకు దూరంగా ఉన్న హరికృష్ణ.. మోహన్ బాబు హీరోగా వచ్చిన ‘శ్రీరాములయ్య’ చిత్రంలో నక్సలైట్ సత్యం పాత్ర పోషించారు. ఈ పాత్ర అందరినీ ఆకట్టుకుంది.
దీంతో.. తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో సీతారామారాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య వంటి సినిమాల్లో నటించారు. హీరోగా అనూహ్య విజయాలు అందుకొని కొంత కాలం స్టార్ గా వెలుగొందారు. పోసాని తెరకెక్కించిన శ్రావణమాసం చిత్రం తర్వాత హరికృష్ణ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.
అయితే.. ఆయన ఎక్కడ ఉన్నా, ఏ రంగంలో ఉన్నా.. తనదైన విలక్షణతను చాటిచెప్పారు. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్ధలు కొట్టే హరికృష్ణ.. ముక్కుసూటి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి మనిషి అర్థంతరంగా ఈ లోకాన్ని వదిలివెళ్లిపోవడం బాధాకరం. నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన హరికృష్ణ జయంతి ఇవాళ. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతోపాటు నందమూరి అభిమానులు నివాళులర్పిస్తున్నారు.