Chiranjeevi And Rajamouli: స్టార్స్ వెనుక దర్శకులు పడతారు… కానీ దర్శకుడు రాజమౌళి వెనుక స్టార్స్ పడతారు. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని తాపత్రయపడతారు. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే కొత్త రికార్డుల గురించి మాత్రమే ఆలోచించాలి. ప్లాప్ అవుతుందనే బెంగ అసలే ఉండదు. తన హీరో పేరిట ఉన్న పాత రికార్డ్స్ చెరిపేయడం, నయా రికార్డ్స్ సెట్ చేయడం ఆయనకు అలవాటు. ఆయన కలెక్షన్స్ రికార్డ్స్ ఆయనే బ్రేక్ చేసుకుంటారు. మరో దర్శకుడి వల్ల కానే కాదు. చరిత్ర పరిశీలిస్తే మనం గమనిస్తుంది ఇదే.

మరి అలాంటి రాజమౌళితో మూవీ చేయను అని ఎవరు మాత్రం అంటారు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం రాజమౌళితో మూవీ చేయాలని లేదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ”రాజమౌళి గొప్ప దర్శకుడు. తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు.ఆయన లోతైన పరిశీలన కలిగిన దర్శకుడు. నటుడిగా ఆయన కోరుకునే అవుట్ ఫుట్ నేను ఇవ్వగలనో లేదో. ఆయన ఒక చిత్రానికి మూడు నుండి ఐదేళ్ల సమయం తీసుకుంటారు. నేను ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నాను. అందుకే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని, పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని లేదు” అని చెప్పారు.
ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పిన చిరంజీవి ముక్కుసూటితనానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గతంలో కూడా చిరంజీవి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రాజమౌళి సినిమాల్లో నటించడం చాలా కష్టం. ఈ వయసులో అది నా వల్ల కాకపోవచ్చని ఆయన తెలిపారు. ఇక చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 5న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో గాడ్ ఫాదర్ విడుదల కానుంది.

గాడ్ ఫాదర్ మలయాళ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారు. సల్మాన్ కీలకమైన క్యామియో రోల్ చేస్తుండగా, నయనతార పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. సత్యదేవ్, సునీల్ సైతం గాడ్ ఫాదర్ మూవీలో భాగమయ్యారు. గాడ్ ఫాదర్ ట్రైలర్ విశేష ఆదరణ దక్కించుకోగా… మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.