టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు కాకరేపుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు ఈ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతుండడంతో వర్గాల వారీగా నటీనటులు విడిపోయారు.
తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘తాను నాన్ లోకల్ అన్న వారికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నానని.. నా సహాయకులకు ఇళ్లు కట్టించానని.. ఇంత సేవ చేసిన నేను నాన్ లోకల్ ఎలా అవుతానని.. మేమంతా ఇండియన్ యాక్టర్స్ అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.
ఇక ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నాగబాబు నిలబడ్డారు. తన మద్దతును ప్రకాష్ రాజ్ కు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో నాగబాబు మాట్లాడుతూ ‘ప్రకాష్ రాజ్ రెండు నెలల క్రితం కలిసి నాకు ‘మా’ అభివృద్ధి గురించి చెప్పారు. నాకు ప్రకాష్ రాజ్ సేవ చూసి ముచ్చటేసింది. ఆయన ‘మా’ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్నారు అనగానే ‘లోకల్’, నాన్ లోకల్ అనే వాదన తెరమీదకు వచ్చింది. అసలు దీనికి ప్రమాణం ఏంటి? ‘మా’లో సభ్యత్వం ఉంటే ఎవరైనా ఎన్నికల్లో పోటీచేయవచ్చు. నాలుగేళ్లుగా వివాదాలతో ‘మా’ ప్రతిష్ట మసకబారింది.
మళ్లీ మా ప్రతిష్ట పెరిగే విధంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి అధ్యక్షుడు అవ్వాలి. ప్రకాష్ రాజ్ కు చిరంజీవి ఆశీస్సులు కూడా ఉన్నాయని.. ఇండస్ట్రీ పెద్దనే మద్దతు ఉందని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకాష్ రాజ్ ఒక మంచి యాక్టర్.. అతడికి మేము సపోర్ట్ చేస్తున్నాము’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.
సెప్టెంబర్ లో జరుగనున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ పోటీ పడనున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగబాబు, బండ్ల గణేష్, శ్రీకాంత్, ఉత్తేజ్, సమీర్, సన, బెనర్జీ, నాగినీడు , అనసూయ, ఏడిద శ్రీరామ్, ప్రగతి, తనీష్, అజయ్ తదితరులు హాజరయ్యారు.