Mythri Movies: దిల్ రాజుకు ఏదీ కలసి రావడం లేదు. అల్లు అరవింద్ కు కాంతారా ముందు ఏమీ బాగోలేదు. దగ్గుబాటి సురేష్ పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు. ఈ ముగ్గురు వాళ్ల కానిది అమెరికా నుంచి వచ్చిన ప్రవాస తెలుగు వాళ్ళు చేసి చూపిస్తున్నారు. పెద్దపెద్ద హీరోలతో బడా బడా ప్రాజెక్టులు లైన్లో పెట్టారు. ఆ మాటకు వస్తే అంతకుముందు ఇండస్ట్రీ హిట్లు కూడా ఇచ్చారు. ఇంతకీ వారు ఎవరు? వారి ప్రణాళిక నిర్మాతలకు చెబుతున్న పాఠం ఏమిటి? ఓ లుక్కేద్దాం రండి.

సైలెంట్ గా బడా ప్రాజెక్టులు
2015 ముందు అగ్ర నిర్మాణ సంస్థలు అంటే దిల్ రాజు వెంకటేశ్వర క్రియేషన్స్, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ దగ్గుబాటి సురేష్ బాబు బ్యానర్లే అని జనాల్లో ఒక నమ్మకం ఉండేది. కానీ ఎప్పుడైతే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ తో దూసుకొచ్చింది మైత్రి మూవీ మేకర్స్. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో టాప్ బ్యానర్ గా ఎరిగింది. స్టార్ హీరోలందరూ మైత్రి వారితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో అగ్ర హీరోలు, దర్శకులు, హీరోయిన్ అందరికీ మైత్రి నిర్మాణ సంస్థ మందస్తు చెల్లింపులు ఇచ్చి లాక్ చేస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్లతో పాటు విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్ వంటి మిడ్ రేంజ్ హీరోలు ఇలా అందరూ మైత్రిలోనే సినిమాలు చేస్తున్నారు. ఆఖరికి తమిళ విజయ్, బాలీవుడ్ సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలను కూడా మైత్రి మూవీస్ లాక్ చేసింది. ఇప్పుడు మరో నిర్మాణ సంస్థ కూడా మైత్రి లాగే దూసుకుపోతుంది. అదే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.

కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. ఆల్రెడీ కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ & మారుతి కాంబినేషన్లో రూపొందే సినిమా ఈ బ్యానర్ లోనే. పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో ఓ సినిమా కూడా ఈ బ్యాన్ లోనే నిర్మాణం కానుంది. రవితేజతో ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు. గోపీచంద్ తో కూడా ఒక క్రేజీ మూవీ నిర్మిస్తున్నారు. ఇంకా కొంతమంది స్టార్ హీరోలకు అడ్వాన్సులు ఇచ్చిన టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు పదిమంది పెద్ద హీరోలకు అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేశారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ బాలీవుడ్ స్టార్ హీరో తోని కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో భారీ నిర్మాణ సంస్థలుగా పేరొందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ వెనుకంజ వేస్తుండంతో మైత్రి, పీపుల్స్ మీడియా సంస్థలు దూసుకుపోతున్నాయి. అన్నట్టు వీరు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు కూడా పెట్టారు. ఓవర్ సీస్ పై కూడా కన్నేశారు.